పండుగ వచ్చిందంటే చాలు సినిమాలు వరుసెంట విడుదల కార్యక్రమాలను పెట్టుకుంటారు దర్శక నిర్మాతలు. తెలుగు పరిశ్రమలో సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా ప్రతి పండుగకి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడం బ్లాక్ బస్టర్స్ కొట్టడం మాములే. అయితే ఈసారి క్రిస్ మస్ కి కూడా సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. అయితే ఈ పోటీలో స్టార్ హీరో సినిమాలు లేకపోయినా పోటీ మాత్రం రసవత్తరంగా సాగుతుందని అంచనా. సంవత్సరం ముగిసే ఈ సందర్భంలో ప్రేక్షకులకు తమ సినిమాలతో ఫుల్ ఖుషీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ప్రస్తుతం ఈ నెల 17న లోఫర్ సినిమా విడుదల అవుతుండగా సినిమా మీద మెగా అభిమానులతో పాటు పూరి అభిమానులు కూడా మంచి అంచనాలతో ఉన్నారు. ఇక 24, 25 తారీఖుల్లో ఏకంగా 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 24న అబ్బాయితో అమ్మాయి అంటూ నాగ శౌర్య, పాలక్ లల్వాని జంటగా నటిస్తున్న ఈ సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తుంది. స్నేహితులు ప్రేమికులుగా ఎలా మారుతారన్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇది. ఇక 25న ఏకంగా 4 సినిమాలు విడుదలవుతుండటం విశేషం.
సౌఖ్యం, భలే మంచి రోజు, జతకలిసే, మామ మంచు అల్లుడు కంచు సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. లౌఖ్యంతో హిట్ కొట్టి జిల్ తో పర్వాలేదనిపించిన యాక్షన్ హీరో గోపీచంద్ మరోసారి కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా సౌఖ్యం. ఇక సుధీర్ బాబు చేస్తున్న మరో ప్రయత్నంగా విడుదలవుతుంది భలే మంచి రోజు. సినిమా మొదలైన నాటినుండి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్న ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మంచు మామ మోహన్ బాబుతో అల్లరి అల్లుడు నరేష్ చేసే సరదా సరదాగా వస్తున్న సినిమా మామ మంచు అల్లుడు కంచు. విష్ణు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో అలనాటి తారలు రమ్యకృష్ణ, మీనా మళ్లీ మోహన్ బాబుతో నటించడం ఈ సినిమాకు కలిసి వచ్చిన అంశం. కొద్దిరోజులుగా అపజయాలను మూట కట్టుకుంటున్న అల్లరి నరేష్ కి ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మొన్ననే రాజు గారి గది అంటూ మొదటి ప్రయత్నంగా సక్సెస్ సాధించిన అశ్విన్ హీరోగా బబ్లీ గర్ల్ తేజస్విని హీరోయిన్ గా వస్తున్న సినిమా జత కలిసే.. సాయి కొర్రపాటి ఈ సినిమాను విడుదల చేయడంతో సినిమా దర్శక నిర్మాతలు కొత్త వారైనా సరే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఒక్క రోజు గ్యాప్ తో విడుదలవుతున్న ఐదు సినిమాల్లో ఏ సినిమా విజయ పతాకం ఎగురవేస్తుందో చూడాలి. ఇక ఈ సంవత్సరం విడుదలయ్యే ఆఖరి తెలుగు సినిమాలు కూడా ఇవే అవ్వడం విశేషం.