హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ ఇవాళ దాడులు జరిపింది. సీబీఐ అధికారులు కేజ్రీవాల్ కార్యాలయంలో, ఇతర మంత్రుల ఛాంబర్లలో సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్లో వెల్లడించటమే కాకుండా, నరేంద్రమోడి ప్రభుత్వపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక, ఇలాంటి పిరికిపనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోడి ఒక పిరికిపంద, సైకోపాత్ అని విమర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలమేరకే సీబీఐ సోదాలు జరుపుతోందని ఆరోపించారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం, తాము కొందరు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపైనే తాము దాడులు జరుపుతున్నామని చెప్పారు. రాజేంద్రకుమార్ కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ రాష్ట్ర టెండర్లు ఒక నిర్ణీత సంస్థకే దక్కేటట్లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం అనుమతితోనే సోదాలు చేస్తున్నామని, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. అయితే ఆ ఆరోపణలు అబద్ధమని కేజ్రీవాల్ అన్నారు. తన ఆఫీసుపైనే దాడులు జరిగాయని, తన కార్యాలయంలోని ఫైల్స్‌ను సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజేందర్ అనేది ఒక నెపం మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రానికి లొంగేదిలేదని ట్వీట్ చేశారు. అయితే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు కేజ్రీవాల్ ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రధానిపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. కేంద్రంతో ఘర్షణ పడటం కేజ్రీవాల్‌కు సరదా అన్నారు.
ఢిల్లీ నగరంలోని షాకూర్ బస్తీలో మురికివాడలను రైల్వే అధికారులు కూల్చివేయటంతో ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య కొత్త గొడవ ప్రారంభమయింది. ఈ బస్తీవాసులు ఆప్ పార్టీకి ఓటు వేశారని కక్షసాధింపుగానే కేంద్రం ఈ కూల్చివేతకు పాల్పడిందని ఆ పార్టీ నేతల ఆరోపణ. ఈ కూల్చివేతల సందర్భంగా మురికివాడలలోని ఒక చిన్నపాప కూడా చనిపోయింది.