మూడేళ్ళ క్రితం డిశంబర్ 16న డిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో మూడేళ్ళ నిర్బంధ శిక్షా కాలం పూర్తి చేసుకొన్న బాల నేరస్థుడుని ఈనెల 20వ తేదీన విడుదల చేయవలసి ఉంది. అతను మళ్ళీ నేర ప్రపంచంవైపు మళ్ళకుండా నివారించాలనే మంచి ఉద్దేశ్యంతోనే కేజ్రీవాల్ ప్రభుత్వం అతనికి రూ.10,000 నగదు, ఒక కుట్టు మిషను ఇవ్వడానికి సిద్దపడింది. కానీ అటువంటి హేయమయిన నేరం చేసిన వ్యక్తికి సహాయం అందించాలనే ఆలోచనను డిల్లీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిభింబించనప్పటికీ అతని పట్ల సమాజం ఏవిధంగా వ్యవహరించే అవకాశం ఉందో చూచాయగా తెలియజేస్తోంది. అంటే ఒకవేళ అతను విడుదలయితే సమాజం అతనిని కాకులు పొడిచినట్లు పొడిచి పొడిచి భాదించే అవకాశం ఉంది. దాని వలన అతను ఇంకా కరడుగట్టిన నేరస్తుడిగా మారే ప్రమాదం ఉంది.
ఇంకా విచారకరమయిన విషయం ఏమిటంటే ఈ మూడేళ్ళ నిర్బంధం కాలంలో అతనిని బాల నేరస్తుల సంరక్షణా కేంద్రం అధికారులు సంస్కరించడంలో విఫలమయ్యారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేస్తోంది. డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుడు కేసులో నిర్బంధించబడిన మరో బాల నేరస్తుడితో అతను స్నేహం చేసి ఉగ్రవాదంపై ఆసక్తి పెంచుకొన్నట్లు అనుమానిస్తున్నాయి. కనుక అతని విడుదల చేయకుండా మరికొంత కాలం నిర్బంధించాలని కేంద్రప్రభుత్వం, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి డిల్లీ హైకోర్టుని కోరుతున్నారు.
అయితే మూడేళ్ళపాటు అతను నిర్బంధంలో ఉన్నప్పుడు మానసిక వైద్యుల సహకారంతో అతనిని సంస్కరించే అవకాశం ఉన్నప్పటికీ ఆపని చేయకుండా, అతను శిక్షా కాలం పూర్తి చేసుకొన్న తరువాత మళ్ళీ జైలుకి తరలించినట్లయితే అతనిలో సమాజం పట్ల ద్వేషం మరింత పెరగవచ్చును. ఇంతవరకు బాలనేరస్థుల శరణాలయంలో ఉన్న అతనిని జైలుకి తరలించి తీవ్ర నేరాలు చేసిన వారితో కలిపినట్లయితే అతను ఒక కరుడుగట్టిన నేరస్తుడిగా మారే ప్రమాదం ఉంది.
అలాగని అతని మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోకుండా విడుదల చేయడం కూడా ప్రమాదమే. ఇటువంటి తీవ్ర నేరాలకు పాల్పడి విడుదలయిన వారిపై విదేశాలలో పోలీసులు నిరంతర నిఘా ఉంచుతారు. ఇతనిపై కూడా అదే విధంగా నిఘా ఉంచవలసిందిగా నిర్భయ తల్లి తండ్రులు కోర్టుని కోరారు. ఇటువంటి నేర ప్రవృతి కలిగినవారిపై కేవలం చట్ట ప్రకారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కంటే మానసిక నిపుణులు, స్వచ్చంద సంస్థల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకొన్నట్లయితే అతనికి, అతని వలన సమాజానికి నష్టం జరగకుండా నివారించవచ్చును. అతను ఈనెల 20వ తేదీన విడుదల కావలసి ఉంది కనుక డిల్లీ హైకోర్టు ఈలోగానే తన తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.