హైదరాబాద్: ఐఫోన్ ఒక ప్రీమియం ప్రోడక్ట్ అన్న సంగతి తెలిసిందే. దాని రేటు రు.40 నుంచి 70వేల వరకు ఉంటుంది. అయితే అది ఇకనుంచి మిడ్ రేంజ్‌లోకి దిగివస్తోంది. ఇండియాలో చైనా కంపెనీల మోడల్స్‌ను… ముఖ్యంగా ఒన్ ప్లస్ టూ మోడల్స్, గూగుల్ నెక్సస్ మోడల్‌ను ఎదుర్కోవటంకోసం యాపిల్ సంస్థ కొత్త వ్యాపార ఎత్తుగడను ప్రయోగించింది. ఇండియాలో తన ఐఫోన్ ధరలను భారీగా తగ్గించింది.
గత సెప్టెంబర్ నుంచి రు.44,500కు అమ్ముతున్న ఐఫోన్ 5ఎస్ ఎంట్రీ లెవల్ మోడల్‌ను ఇప్పుడు రు.21, 945కు అమ్ముతున్నారు. ఇది ఆన్లైన్ రీటైల్ పోర్టల్స్‌లో ధర… ఓపెన్ మార్కెట్లో దీని ధర 24,999గా ఉంది. కలర్, స్పేస్ మారినకొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది. రెండు జనరేషన్ల క్రితం మోడల్ అయినప్పటికీ ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే ఐఫోన్ మోడల్ – 5ఎస్సే. దేశంలో అమ్ముడయ్యే మొత్తం ఐఫోన్స్‌లో 50 శాతం 5ఎస్ మోడలే ఉంటాయి. అమ్మకాలు అత్యధికంగా జరిగే సీజన్ వస్తుండటంతో తమ సేల్స్ పెంచుకునే ఉద్దేశ్యంతో యాపిల్ ఈ రేటు తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తాజా మోడల్ 6ఎస్ పైన కూడా యాపిల్ సంస్థ తగ్గింపు ఇస్తోంది. 6ఎస్‌ను ఫ్లిప్ కార్ట్ రు.49,499కు అందిస్తుండగా, 6ఎస్ ప్లస్‌ను రు.10,000 తగ్గించి రు.62,000కు అమ్ముతోంది. కానీ యాపిల్ ఎంత తగ్గించినా 5ఎస్ మోడల్ ఫోన్లో స్క్రీన్ 4 అంగుళాలే ఉండటం, ఒన్ ప్లస్ టూ మోడల్లో స్పెసిఫికేషన్స్ దానికంటే బాగుండటం వలన, కేవలం బ్రాండ్ ఇమేజ్ కావాలనుకునేవాళ్ళు మాత్రమే ఈ తగ్గిన 5ఎస్ మోడల్‌ను కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఐప్యాడ్ ప్రో ఇవాళ ఇండియాలోకి ఎంటరయింది. 12.9 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఐప్యాడ్ ధర రు.67,900 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మోడల్ ధర రు.91,900గా ఉంటుంది. బ్లూ టూత్ కీబోర్డ్ కావాలనుకుంటే మరో రు.11,000, స్టైలస్(యాపిల్ పెన్సిల్) కావాలనుకుంటే మరో రు.8,600 పెట్టుకోవాలి.