హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. విజయవాడలో తన తాత అల్లు రామలింగయ్యకు, తనకు వీరాభిమాని అయిన ఒక వృద్ధురాలు మస్తాన్‌బీ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె చివరి కోర్కెను తీర్చటానికి విజయవాడలోని ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఒక టీవీ ఛానల్లో ఆమె చివరికోర్కె గురించి ప్రసారం చేసిన కథనాన్ని చూసి అల్లు అర్జున్ చొరవ తీసుకుని విజయవాడ వెళ్ళారు. ఇవాళ ఉదయం తన ఇంటికి వచ్చిన అర్జున్ను చూసి మస్తాన్ బీ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ దేవుడే అర్జున్ను తనవద్దకు పంపించాడని అన్నారు. అర్జున్ ఆమెను పరామర్శించి వెంట తెచ్చిన పళ్ళను ఇచ్చారు. ఎవరి అభిమానులైనా ఇలా అంతిమ కోర్కె తెలిపితే సెలబ్రిటీలు వారిని కలుసుకుని పరామర్శించాలని, ఇప్పటికే సెలబ్రటీలందరూ అలానే చేస్తున్నారని అల్లు అర్జున్ అన్నారు. ఇలా బయటకొచ్చినపుడు తనమీద అభిమానులకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటుందని, ఇది తనకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని చెప్పారు. మస్తాన్ బీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అల్లు అర్జున్ తాను వస్తున్న సమాచారం రహస్యంగా ఉంచినప్పటికీ, అది ఎలాగోలా బయటకు పొక్కి మస్తాన్ బీ ఇంటివద్దకు అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.