హైదరాబాద్: విజయవాడలో ఇటీవల బయటపడిన కాల్‌మనీ వ్యవహారం చూస్తుంటే కరీంనగర్లో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం గుర్తురావటం అనివార్యం. ఈ రెండు వ్యవహారాలలో చాలా పోలికలు, కామన్ పాయింట్లు కనిపిస్తాయి. అయితే ఓవరాల్‌గా చూస్తే మాత్రం విజయవాడ వ్యాపారులకంటే మోహన్ రెడ్డే మంచివాడనిపిస్తున్నాడనటంలో ఏమాత్రం సందేహంలేదు.
కాల్‌మనీ వ్యవహారం అందరినీ అప్రతిభులను చేస్తోంది. కాల్‌మనీ వ్యాపారులు చేసే రాక్షసకృత్యాలు బయటకొస్తున్నకొద్దీ అందరికీ వళ్ళు గగుర్పొడుస్తోంది. అప్పులు తిరిగి చెల్లించనవారి ఇళ్ళకు బౌన్సర్లను పంపి ఆ ఇళ్ళలోని ఆడవాళ్ళను బెదిరించటం, ఇంకా చెల్లించకపోతే వారిని ఆఫీసుకు రప్పించుకుని మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేసి వీడియో తీయటం, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయటం, వ్యభిచార వృత్తిలోకి దించటం, బానిసలుగా చేసుకోవటం వంటి దారుణాలకు ఈ వ్యాపారులు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అలా అప్పులు తీసుకున్న వారికి చెందిన మహిళలతో తీసిన వీడియోల సీడీలు ఎన్నో పట్టుబడ్డాయి. యలమంచిలి రాము, వెనిగళ్ళ శ్రీకాంత్, దూడల రాజేష్‌లతో పాటు ప్రభుత్వోద్యోగి సత్యానందం, రిటైర్డ్ కానిస్టేబుల్ నీలాంబరంవంటి ఎందరో ఈ రాకెట్లో ఉన్నారు. విజయవాడ కమిషనరేట్‌లోని పోలీస్ అధికారులు కూడా ఈ వ్యాపారుల ద్వారా తమ అక్రమార్జనను వడ్డీకి తిప్పుతూ డబ్బు గడిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సత్యానందం ద్వారాకూడా కొందరు ప్రభుత్వోద్యోగులు తమ అక్రమార్జనను వడ్డీకి తిప్పుతున్నట్లు సమాచారం.
ఇక కరీంనగర్లో ఫైనాన్స్ వ్యవహారం చూస్తే, ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపార అక్రమాలకు గురై అప్పులు తీసుకున్న ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకోవటంతో అతని అరాచకాలు బయటకొచ్చాయి. అత్యధిక వడ్డీలకు అప్పులు ఇవ్వటం, తిరిగి చెల్లించనివారినుంచి ఇళ్ళు, స్థలాలు తదితర ఆస్తులు రాయించుకోవటం వంటి అకృత్యాలు మోహన్ రెడ్డి చేయించినట్లు వెలుగులోకొచ్చింది. ఆత్మహత్య ఉదంతంతో ఈ అరాచకాలు బయటకొచ్చి మోహన్ రెడ్డి అరెస్ట్ అవటంతో అతని బాధితులు ధైర్యంగా బయటకొచ్చి మీడియాముందు తమ బాధలు చెప్పుకున్నారు. అక్రమార్జన చేసే పలువురు డీఎస్పీలు, ఏఎస్పీలవంటి పోలీస్ ఉన్నతాధికారులు మోహన్ రెడ్డికి పెట్టుబడి పెట్టి డబ్బులు తిప్పినట్లు బయటపడింది. రాజకీయనేతలు కూడా మోహన్ రెడ్డివద్ద అప్పులు తీసుకున్నట్లు చెప్పారు.
ఈ రెండు వ్యవహారాలను గమనిస్తే, రెండింటిలోనూ ఒక ప్రధానమైన పోలిక ఉంది. విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో కీలకమైన నగరం. గుండెకాయలాంటిదని చెప్పొచ్చు. ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతంగా, ప్రగతిశీలకంగా, క్రియాశీలకంగా ఉంటారు. ఇటు కరీంనగర్ కూడా అంతే. హైదరాబాద్ రాజధాని నగరం అయినప్పటికీ అక్కడ సీమాంధ్రులు, ఇతర ప్రాంతాలవారు ఎక్కవ శాతం ఉంటారు కాబట్టి, దానిని పక్కన పెడితే తెలంగాణలో అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం కరీంనగరే. అక్కడ సంస్కృతి, నాగరికత, ప్రగతి, ఆలోచనలు తెలంగాణలోని మిగిలిన అన్నిప్రాంతాలకంటే ఎంతో ముందుంటాయి. దీనిని తెలంగాణ విజయవాడగా పేర్కొనవచ్చు.
రెండు చోట్లా అక్రమ సంపాదన పెట్టుబడిగా వచ్చి చేరటం మరోపోలిక. కరీంనగర్లో ఎక్కువగా పోలీస్ అధికారులు అక్రమ సంపాదన పెట్టుబడిగా ఉంటే, విజయవాడలో పోలీస్ అధికారులు, ప్రభుత్వోద్యోగులతో పాటు రాజకీయనేతల అక్రమార్జన అత్యధికంగా ఉంది. అక్కడ ముగ్గురు-నలుగురు పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడి సస్పెన్షన్ వేటుకూడా పడింది. ఇక్కడేమో రాజకీయ నేతల ప్రమేయం బయటపడింది. అక్కడ ఉన్నతాధికారుల ప్రమేయం కావటంతో ప్రభుత్వంపై మచ్చపడలేదు. ఇక్కడ అన్నిపార్టీలవారూ ఉన్నాగానీ, అధికశాతం అధికారపార్టీవారే కావటంతో ప్రభుత్వంపై మచ్చపడింది. మరోవైపు కరీంనగర్లో జరిగిన అక్రమాల పరిమాణం విజయవాడతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ. అక్కడ వందల కోట్లలో అక్రమాలు జరిగాయి. లక్షల్లో అప్పులిచ్చి కోట్లలో కొల్లగొట్టారు. ఇక్కడమాత్రం చిన్న మొత్తాలే ఎక్కువ. అయితే అక్కడ డబ్బే దోచుకున్నారు. మానాన్ని, గౌరవాన్ని అపహరించలేదు. విజయవాడలో వ్యాపారులు చాలా అడుగులు ముందుకెళ్ళిపోయారు. అక్రమ వ్యాపారాలను కొత్తపుంతలు తొక్కించారు. క్రియేటివ్నెస్ జోడించి వ్యాపారాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. ఎంతైనా ఆంధ్రావాళ్ళు ఫాస్ట్ కదా!