హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అధికార టీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించినా అది తప్పేనంటూ పరోక్షంగా టీఆర్ఎస్కు చురకలు అంటించారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలు కోరుకుంటున్నామని అన్నారు. పార్టీల మధ్య జరిగే రాజకీయ వివాదాల జోలికి తాము పోదలుచుకోలేదని చెప్పారు. ఒక పార్టీని వదిలివెళ్ళటం లాంటి పరిణామాలు రాజకీయ అస్థిరతకు దారితీస్తాయని అన్నారు. ఇటీవల టీఆర్ఎస్లోకి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి పెద్దఎత్తున నాయకులు చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ చేపట్టిన ఆ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ఆ పార్టీ కీలకనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ సమర్థించుకోవటమేకాక, ఇది తామొక్కరమే చేస్తున్నామా అని ఇటీవల ఎదురు ప్రశ్నించిన విషయం కూడా అందరికీ విదితమే.
రైతుల ఆత్మహత్యల నివారణకు కళాకారులు పాటలు తయారుచేయాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. గ్రూప్ డి, బ్యాంక్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో మెలగాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. త్వరలో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు.