ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. పార్టీలో నేతలే ఇటువంటి అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నపుడు వారిని మొదట్లోనే నియత్రించకపోవడం వలననే ప్రభుత్వం ఇప్పుడు అప్రదిష్ట పాలవుతోంది. ఒకవేళ ఈ వ్యవహారాల గురించి ప్రభుత్వానికి తెలిసి ఉండకపోతే అది కూడా మరో వైఫల్యంగానే భావించవలసివస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులు, ప్రజా ప్రతినిధుల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు రప్పించుకొని వారికి మార్కులు కూడా వేస్తునప్పుడు, పార్టీలో, ప్రభుత్వంలో కొందరు నేతలు ఇటువంటి అనైతిక వ్యవహారాలకి పాల్పడుతున్నట్లు అయన గమనించలేదంటే నమ్మశక్యం కాదు.
ఇదివరకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్నందుకు ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై అధికార పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకర్ చెయ్యి చేసుకొన్నపుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కటినంగా వ్యవహరించి ఉండి ఉంటే అది పార్టీలో నేతలందరికీ గట్టి హెచ్చరికను ఇచ్చి ఉండేది. కానీ అప్పుడు ఆయనని వెనకేసుకొని రావడం వలననే ఆ తరువాత అతను దైర్యంగా కొల్లేరు సరస్సు మధ్యలో రాత్రికి రాత్రి మట్టి రోడ్డు నిర్మించారని భావించవచ్చును. అప్పుడు కూడా అతను అటవీ శాఖ సిబ్బందితో దురుసుగా వ్యవహరించడంతో వారు పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తద్వారా అధికార పార్టీ నేతలను ముఖ్యమంత్రే వెనకేసుకు వస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపద్యంలో మళ్ళీ ఇప్పుడు కాల్ మనీ వ్యవహారంలో వరుసగా తెదేపా నేతల పేర్లే బయటపడుతున్నాయి. కనుక ఇప్పుడు కూడా ప్రభుత్వం తన పార్టీ నేతలను ఈ కేసుల నుండి తప్పించే ప్రయత్నాలు చేస్తోందని, అందుకే విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ ని అకస్మాత్తుగా 10 రోజుల పాటు శలవు మీద పంపిస్తోందని వైకాపా ఆరోపిస్తోంది. నిజానికి ఆయన ఆస్ట్రేలియాలో స్థిరపడిన తన అల్లుడు, కుమార్తె వద్దకు వెళ్లేందుకు నెలరోజుల క్రితమే శలవుకు దరఖాస్తు చేసుకొని, అందుకోసం టికెట్స్ కూడా కొనుకొన్నారు. ఈ ఏడాది వారితో కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనుకొన్నారు. కానీ ఊహించని విధంగా ఈ కాల్ మనీ వ్యవహారం బయటపడటంతో ఆయన శలవుపై వెళ్ళడం కూడా చాలా అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి తన పార్టీ నేతలను అదుపులో ఉంచుతూ, అక్రమాలకు పాల్పడినవారిని కటినంగా శిక్షించి ఉండి ఉంటే, నేడు ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు చేయగలిగేవి కావు. అసలు వారికి ఆ అవకాశం కలిగి ఉండేది కాదు కూడా. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలలో అనుమానాలు, అపోహలు ఏర్పడేవే కావు. కానీ చింతమనేని ప్రభాకర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వెనకేసుకొనిరావడం వలన ఇప్పుడు ఆయన తన పార్టీ నేతల పట్ల నిజంగా కటినంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపగలుతున్నాయి. ఆ కారణంగానే ప్రభుత్వం పట్ల ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
అయితే ఈ కేసులు, అక్రమ వ్యవహారాలు, అనుమానాలు, అపోహల వలన తెదేపా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చును. కానీ ఇటువంటివన్నీ ప్రజల మనస్సులో ‘రికార్డ్’ అయిపోతుంటాయి. ఎన్నికల సమయంలో ప్రజలు వాటికి లెక్కలు సరిచూస్తారు. ఉదాహరణకి దేశాన్ని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదేళ్ళ పాటు నిరాటంకంగా, యదేచ్చగా పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం చెలరేగిపోయింది. అప్పుడు ప్రజలు ఏమీ చేయలేకపోయారు. కానీ ఎన్నికల సమయంలో దానిని చాలా కటినంగా శిక్షించారు. ఆ అనుభవాన్ని తెదేపా ప్రభుత్వం కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి తనను తాను అదుపులో ఉంచుకొంటూ, ప్రజలు తమ నుండి ఏమి ఆశించి అధికారం కట్టబెట్టారో సదా గుర్తుంచుకొని ఆ పనులను నెరవేర్చగలిగితే దానికే మంచిది. లేకుంటే చివరికి అదే నష్టపోవచ్చును.