పశ్చిమ డిల్లీలోని రైల్వే శాఖకు చెందిన భూములలో వెలిసిన షాకూర్ బస్తీవాసులకు ఎన్ని సార్లు నోటీసులు పంపినా ఖాళీ చేయకపోవడంతో మొన్న ఆదివారంనాడు రైల్వే మరియు రెవెన్యూ అధికారులు కలిసి ప్రొక్లెయినలతో అక్కడ నివసిస్తున్న పేదల ఇళ్ళను కూల్చివేశారు. ఆ సమయంలో ఒక ఇంటిలో నిద్రిస్తున్న ఆరు నెలల పసిపాప శిధిలాల క్రిందపడి నలిగి చనిపోయింది. కానీ ఆ పాప ఇళ్ళ కూల్చివేతకు రెండు గంటల ముందే మరణించిందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు వాదించారు.
ఆ పాప శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఆ పాప ఛాతి, తలపై తీవ్ర గాయాలయ్యాయని, ఆ కారణంగా తీవ్రరక్తస్రావం అవడం చేత పాప మరణించిందని తమ నివేదికలో పేర్కొన్నారు.ఆ పాపకి కొన్ని పక్కటెముకలు కూడా విరిగిపోయి ఉన్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ మార్టం నివేదికతో ఇళ్ళ కూల్చివేతలో పాల్గొన్న రైల్వే మరియు రెవెన్యూ అధికారులలో కంగారు మొదలయింది. ఈ కూల్చివేత వ్యవహారంపై డిల్లీ హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందుకు బాధ్యులయిన అధికారులు అందరినీ తన ముందు హాజరుకమ్మని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేసి ఈ వ్యవహారంపై తక్షణమే సంజాయిషీలు ఇవ్వవలసినదిగా ఆదేశించింది. రైల్వే అధికారులు పేదల ఇళ్ళను కూల్చి వేయడాన్ని ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు, డిల్లీ ప్రభుత్వం నిరసించాయి. దీనిపై లోక్ సభలో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. అధికారులు ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇళ్ళను కూల్చి వేయడంతో అందులో నివసిస్తున్న నిరుపేదలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు గజగజ వణికించే చలిలో గడుపుతున్నారు. డిల్లీ ప్రభుత్వం వారందరినీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్స్ కి తరలించింది. కానీ ఇంకా చాల మంది షాకూర్ బస్తీలో శరీరం గడ్డ కట్టించే ఆ చలిలోనే గడుపుతున్నారు.