బాహుబలి -2 షూటింగ్ కి రాజమౌళి సిద్ధంకావడంతో ఈ చిత్రం చుట్టూ అనేక ఊహాగానాలు సినీవర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. బహుశా ఏ సినిమా గురించి రానంత టాక్ బాహుబలికి రావడంతో ఎవరేం చెప్పినా అది న్యూస్ అయిపోతున్నది. వెబ్ మీడియా, సోషల్ మీడియాల్లో ఇంచుమించు రోజుకోవార్త బాహుబలి చుట్టూ తిరుగుతోంది. ఎన్ని రూమర్స్ వస్తున్నా, రాజమౌళి మాత్రం నిండుకుండలా ఉంటున్నారు. బాహుబలి టీమ్ కూడా అంతే గోప్యతను పాటిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో రూమర్ సినీవర్గాల్లో షికారుచేసింది. బాహుబలి -2లో ప్రభాస్, రానాతో పాటుగా మరో హీరో నటించబోతున్నాడట. అది కూడా టాలీవుడ్ హీరో అని అంటున్నారు. రాజమౌళి చెప్పకపోయినా ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా ఆ హీరో పేరు చెప్పేస్తున్నాయి. అతను మరెవరో కాదు, యంగ్ హీరో గోపీచంద్.
డైనమిక్ హీరో గోపీచంద్ కు బాహుబలి -2 కథలో తగిన పాత్ర దొరికిందనీ, దాదాపుగా అతని పేరు ఖరారైందని అంటున్నారు. బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ కాగానే దక్షిణాది, ఉత్తరాది యాక్టర్లలో చాలామంది పార్ట్ 2లో నటించడానికి ముందుకువచ్చారు. రాజమౌళికి తమ ఆసక్తిని పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో తెలియజేశారు. తమిళ, హిందీ రంగాల్లోని పెద్ద హిరోలు, హీరోయిన్లు వరుస కట్టినంత పనిచేశారు. కాగా ఆ మధ్య, బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కు బాహుబలి-2లో ఛాన్స్ వచ్చిందంటూ ఓ రూమర్ షికారు చేసింది. బాహుబలి-2 కథ ప్రకారం, దేవసేన (అనుష్క)కు అక్క ఉంటుందట. ఈ సోదరి పాత్రను పోషించే అవకాశం మాధురీ దీక్షిత్ కు దక్కిందన్న వార్తలొచ్చాయి. అయితే, అప్పుడు మాధురీ విషయంలోకానీ, ఇప్పుడు గోపీచంద్ విషయంలోకానీ డైరెక్టర్ రాజమౌళి పెదవి కదపడంలేదు. ఆయన దృష్టంతా `బాహుబలి-2’ని మెగాహిట్ చేయడం మీదనే ఉంది. కథాపరంగా కొత్తపాత్రలు ఉంటాయని మాత్రం చెబుతున్నారు. ఎవరికి ఏపాత్ర దక్కుతుందన్నది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. బాహుబలి -2 ముందుగా అనుకున్నట్లు 2016లో విడుదల కాకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమ్యయేలాగానే ఉంది. 2017లోనే బాహుబలి 2 విడుదల కావచ్చు. ఎక్కడా రాజీలేని ధోరణిలో రాజమౌళి సెకండ్ పార్ట్ ని తీయాలనుకోవడమే దీనికి కారణం. ఏదిఏమైనా రాజమౌళి స్పష్టమైన ప్రకటన ఇస్తేనేకానీ ఈ రూమర్స్ ఆగేటట్లు లేవు. ఆ పని రాజమౌళి ఇప్పట్లో చేసేటట్లులేరు. ఎందుకంటే `బాహుబలి’జనం నోళ్లలో ఎప్పుడూ నానుతూనేఉండాలని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి.