కల్తీ మద్యం కేసులో తొమ్మిదవ నిందితుడిగా పేర్కొనబడిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుమారు వారం రోజులవుతున్నా ఇంతవరకు ఆయనని పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఆయన తరపున విజయవాడ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం ముందస్తు బెయిలు కోరుతూ ఒక పిటిషన్ దాఖలవడం విశేషం. ఆయన తరపున ఆయన లాయర్ ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఆ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.
ఈ కల్తీ మద్యం కేసు బయటపడినప్పుడు ఆ బార్ అండ్ రెస్టారెంట్ తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని మల్లాది విష్ణు వాదించేరు. కానీ స్వయంగా ఆయన తల్లి బాలత్రిపుర సుందరే దాని లైసెన్స్ హోల్డర్స్ లో ఒకరని తేలింది. మల్లాది విష్ణు వంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు పోలీసులకు తక్షణమే లొంగిపోకుండా తప్పించుకొని తిరుగుతుండటం ఒక తప్పు. ఆయన తన లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయగలుగుతున్నప్పటికీ ఇంతవరకు ఆయనని పోలీసులు కనుగొనలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఆయనకు చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ యొక్క లైసెన్స్ హోల్డర్స్ అయిన విష్ణు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల విచారణకు హాజరుకాకపోవడం, కాకపోయినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా మళ్ళీ నోటీసులు జారీ పేరిట ఇంకా ఉపేక్షించడం అనుమానాలకు తావిస్తోంది.