ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సాస్ (ఎయిమ్స్)ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మంగళగిరిలో ఉన్న టీబీ ఆసుపత్రికి చెందిన 193 ఎకరాలలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఈనెల 19న ఉదయం 11గంటలకు ఎయిమ్స్ ఆసుపత్రికి శంఖుస్థాపన జరుగబోతోంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఒక బారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. శంఖుస్థాపనకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున అధికారులు ముమ్మురంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ శంఖుస్థాపన జరుగబోయే ప్రాంతాన్ని సందర్శించి శంఖుస్థాపన కార్యక్రమానికి అవసరమయిన ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేరు. శంఖుస్థాపన చేయవలసిన ప్రదేశం, శిలా ఫలకం, పైలాన్, వేదిక వగైరా ఏర్పాటు చేయవలసిన ప్రదేశాలను గుర్తించి, వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమయిన నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది.