హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కాల్‌మనీ, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు వరసగా రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం నుంచి కడప జిల్లావరకు ఈ దాడులు జరుగుతున్నాయి. వడ్డీ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసి భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు, చెక్కులను స్వాధీనం చేసుకుంటున్నారు… వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు ఇళ్ళకు, ఆఫీసులకు తాళాలు పెట్టి పరారయ్యారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం, విశాఖపట్నం నగరం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో, కాకినాడలో, విజయవాడలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాలలో, ప్రకాశం జిల్లా చీరాల, మార్కాపురం, కందుకూరు, ఒంగోలు, గుంటూరు జిల్లా వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
మరోవైపు విజయవాడలో కాల్‌మనీ వ్యాపారులతో సంబంధాలున్న పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పటమట సీఐగా పనిచేస్తున్న దామోదర్‌ను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. కాల్‌మనీ వ్యాపారం ఎక్కువగా పటమట ప్రాంతంలోనే ఉన్న సంగతి తెలిసిందే. మరో ఆరుగురిపైకూడా ఈ బదిలీ వేటు పడినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్ళటంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆయన సెలవును రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.