తెదేపా అమలాపురం ఎంపి పి. రవీంద్ర బాబు మోడీ ప్రభుత్వానికి నిన్న లోక్ సభలో చురకలు వేశారు. దేశంలో దాదాపు సగం మంది దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నప్పుడు మనకి బులెట్ రైళ్ళు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి ఇటువంటి అనవసరమయిన ప్రాజెక్టులు భుజానికెత్తుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. లోక్ సభలో నిన్న జరిగిన ఉప పద్దులపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేసారు. బులెట్ ట్రైన్ వంటి బారీ ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు చేయడం కంటే దేశంలో నిరుపేదల సంక్షేమం కోసం ఖర్చు చేయడం మేలని అన్నారు. భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొంటునప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ఇంకా నిలబడలేదని, కనుక మన అవసరాలకు తగ్గట్లుగా మన ప్రాధాన్యతలుండాలని ఆయన మోడీ ప్రభుత్వానికి హితవు పలికారు. భారత్ రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న రూ.2లక్షల కోట్ల వ్యయాన్ని కూడా తగ్గించుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తసారు.
ఆయన చెప్పిన ఈ హితోపదేశాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోదని అందరికీ తెలుసు. కానీ దానిని వ్యతిరేకించినందుకు బీజేపీ నేతలు రవీంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని రవీంద్ర బాబు మోడీ ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా ఆయన కోరారు. ఏపీతో సహా దేశంలో మరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని రెండు మూడు రోజుల క్రితమే కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో విస్పష్టంగా చెప్పారు. అయినా రవీంద్రబాబు మళ్ళీ దాని కోసం లోక్ సభలో ఒత్తిడి చేయడం విశేషం.