కాల్ మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటాలలో పోలీస్ అధికారులు నలిగిపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇరుకొన్న తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి ప్రభుత్వమే విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ని శలవు మీద పంపిస్తోందని వైకాపా ఆరోపిస్తోంది. లేకుంటే ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా శలవు మీద ఎందుకు వెళుతున్నారని వైకాపా ప్రశ్నిస్తోంది. గౌతం సవాంగ్ తన శలవు గురించి క్లుప్తంగా ప్రకటించడంతో వైకాపా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. ఆ తరువాత తెదేపా నేతలు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకొన్నపటికీ ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
ఆయన నిజంగానే ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కుమార్తె, అల్లుడు వద్దకు వెళ్లి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని శలవు తీసుకొని ఉండవచ్చును. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలుగజేస్తున్న ఈ కాల్ మనీ వ్యవహారాన్ని ఆయనే స్వయంగా చూస్తునప్పుడు, దానిని మధ్యలో వేరొకరికి అప్పగించి శలవు మీద వెళ్ళడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ పరిస్థితులను చూసిన తరువాతయినా గౌతం సవాంగ్ తన శలవును వాయిదా లేదా రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించి ఉండవలసింది. లేదా ప్రభుత్వమయినా ఆయనను శలవు వాయిదా లేదా రద్దు చేసుకోమని కోరి ఉండవలసింది. కానీ ఆ రెండు జరుగకపోవడం చేతనే ఈ అనుమానాలకు, ఆరోపణలకు అవకాశం ఏర్పడింది.
కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవలసి రావడం పెద్ద ఆశ్చర్యకరమయిన విషం ఏమీ కాదు కానీ గౌతం సవాంగ్ శలవు కోసం కూడా సంజాయిషీలు చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తనంతట తానే శలవు రద్దు చేసుకొన్నారో లేక ప్రభుత్వమే ఆయనను శలవు రద్దు చేసుకోమని కోరిందో తెలియదు కానీ మొత్తం మీద ఆయన తన శలవును రద్దు చేసుకొన్నారు. ఈ కేసు యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తన శలవును రద్దు చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో దోషులు ఎవరయినా సరే విడిచిపెట్టమని చెప్పారు. కానీ ఈ నిర్ణయమేదో ముందే తీసుకొని ఉండి ఉంటే బాగుండేది.
శలవు విషయంలో గౌతం సవాంగ్ సరయిన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఆయనను తప్పు పట్టలేము. కానీ ఇటువంటి సమయంలో ఆయన శలవుపై వెళితే ప్రతిపక్షాలు దానికి ఎటువంటి విపరీత అర్ధాలు తీస్తాయో తెలిసి ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన శలవుపై వెళ్ళడానికి అనుమతించడమే పొరపాటు. దాని వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తమ పార్టీ నేతలను కాల్ మనీ కేసుల నుంచి తప్పించడానికే ఆయనను శలవులో పంపిస్తున్నట్లయింది. కనీసం చేతులు కాలిన తరువాత అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆకులు పట్టుకొని జాగ్రత్త పడింది కనుక ప్రతిపక్షాలు మళ్ళీ అటువంటి ఆరోపణ చేయకుండ నివారించగలిగింది.