హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న కాల్‌మనీ వ్యవహారంపై హైకోర్ట్ రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకోసం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు. క్యాబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వివరించారు. కాల్‌మనీ నిందితులపై క్రిమినల్ చర్యలతోపాటు మనీ ల్యాండరింగ్ కేసులు కూడా పెట్టాల్సి ఉందని, దీనికోసం మనీల్యాండరింగ్ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాల్ మనీ, కల్తీ మద్యంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.
మరోవైపు కాల్‌మనీ వ్యాపారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవారే ఎక్కువమంది ఉన్నారని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది కాల్ మనీ వ్యాపారులను అరెస్ట్ చేస్తే వీరిలో 25 మంది వైసీపీవారు, ఆరుగురు టీడీపీవారు, ముగ్గురు కమ్యూనిస్ట్ పార్టీవారు, 44 మంది ఏ పార్టీకి సంబంధం లేనివారు ఉన్నట్లు పేర్కొన్నారు. జగన్ నిన్న ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం చూస్తే దొంగే దొంగ… దొంగ అని అరిచినట్లుగా ఉందని మంత్రి అన్నారు.