ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే డ్యాన్సులు బాగుంటాయి. మొత్తం క్యారెక్టర్ డ్యాన్స్ బేస్డ్ అయితే రామ్ రెచ్చిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజా చిత్రం ‘నేను… శైలజ’లో రామ్ అలాంటి పాత్రే చేశారు. డీజే (డిస్కో జాకీ)గా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్, సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఈ 21 పాటలను, జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ – ” ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ముందు ఈ చిత్రానికి ‘హరికథ’ అనుకున్నప్పటికీ, ఆ తర్వాత ‘నేను… శైలజ’ బాగుంటుందని అదే ఫైనలైజ్ చేశాం. హీరో పాత్ర సాఫ్ట్ గా ఉంటూనే మాస్ కి కనెక్ట్ అవుతుంది. కిశోర్ తిరుమల ఈ పాత్రను అద్భతుంగా మలిచారు. సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు అద్భుతంగా ఉంటాయి. చిత్రీకరణ కూడా కనువిందుగా ఉంటుంది. అనుకున్న విధంగా చిత్రాన్ని 55 రోజుల్లో పూర్తి చేయగలిగాం” అని చెప్పారు.
రామ్ మాట్లాడుతూ – “ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను నేను చేయలేదు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. లవ్లీగా కూడా ఉంటుంది. అన్ని వర్గాలవారు చూడదగ్గ చిత్రం ఇది” అన్నారు.
సత్యరాజ్, నరేశ్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కష్ణచైతన్య, ప్రదీప్ రావత్, ధన్యా బాలకష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, డ్యాన్స్: శంకర్, ప్రేమ్ రక్షిత్, దినేష్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: కష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిశోర్, రచన-దర్శకత్వం: కిశోర్ తిరుమల.