హైదరాబాద్: విజయవాడలో గత శనివారం బయటపడిన కాల్‌మనీ బాగోతం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాల్‌మనీ వ్యాపారుల రాక్షసకృత్యాలు బయటపడుతుంటే అందరూ నివ్వెరపోతున్నారు. ఇప్పుడు ‘కామ’గా పేరు తెచ్చుకున్న ఈ కాల్‌మనీకి ఆ పేరు ఎందుకొచ్చిందో చాలా మందికి తెలియదు. కాల్ మనీ అంటే కాల్ చేస్తే వచ్చే మనీ. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ వ్యాపారులు మీ ఇంటికొచ్చి మీరడిగిన అప్పు మొత్తాన్ని ఇస్తారు. అంత ఈజీ అన్నమాట. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఇచ్చిన అప్పును ఏ సమయంలోనైనా తిరిగి అడిగే అధికారం ఈ ‘కామ’ వ్యాపారులకు ఉంటుంది. తీసుకున్నవారు ఆ సమయానికి చెల్లించలేకపోతే, వారికి సంబంధించిన స్థిర లేదా చరాస్తులు వేటినైనా ఈ వ్యాపారులు తీసుకెళ్ళే హక్కు ఉంటుంది. అయితే ఈ బాగోతం ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నా ఇప్పుడే ఎలా బయటపడిందని చాలామందికి కలిగిన సందేహానికి సమాధానం ఎట్టకేలకు దొరికింది. ఈ వ్యవహారంలో సూత్రధారి, ఏ1 నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తిని ఒక సీక్రెట్ కెమేరా పట్టించిందనే వాదన ఒకటి వినబడుతోంది.
కాల్‌మనీ వ్యాపారుల బాధితురాలైన ఒక మహిళా డ్రస్ డిజైనర్ ధైర్యం చేసి ఇచ్చిన ఫిర్యాదుపై కదిలిన విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు యలమంచిలి రాముపై నిఘా పెట్టారు. తాను తీసుకున్న రు.1.5 లక్షలకుగానూ వారు రు.6 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు యలమంచిలి రాము ఆఫీసులలో ఒకదానిలో వాళ్ళకు తెలియకుండా సీక్రెట్ కెమేరా అమర్చారు. తద్వారా అతనిని పట్టుకోవటానికి పూర్తి ఆధారాలన్నీ సంపాదించారు. ఆ ఆఫీసుకు వచ్చివెళుతున్న ప్రముఖులందరూ కూడా ఆ కెమేరాలో చిక్కారు. తద్వారా పోలీసుల పని సులభమైపోయింది.
మరోవైపు ఈ బాగోతం బయటపడటం వెనక మరో కారణకూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. తెలుగుదేశం నేతల అంతర్గత విభేదాలవల్లనే ఇది వెలుగులోకొచ్చిందంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పడటంలేదని, అందుకే ఉమాను బుక్ చేయటంకోసమే అతని అనుచరులు బోడే ప్రసాద్, బుద్దా వెంకన్నలకు ప్రమేయమున్న ఈ కాల్‌మనీ వ్యవహారాలను నాని లీక్ చేశాడని, బయటపెట్టించాడని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ప్రభుత్వానికే మచ్చ తెచ్చేస్థాయిదని నాని ఊహించలేకపోయాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఉమాను వ్యతిరేకించే వల్లభనేని వంశీ ఈ వ్యవహారం బయటపడగానే మీడియాముందుకొచ్చి కాల్ మనీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది ఉమా వర్గాన్ని దెబ్బతీయటంకోసమేనని అంటున్నారు. చివరకు పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా అయింది. ఏది ఏమైనా గౌతమ్ సవాంగ్ లాంటి నిజాయతీ అధికారి ఉండటంవలనే ఇది బయటకొచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు.