ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే సభలో యుద్ద వాతావరణం ఏర్పడింది. కాల్ మనీ వ్యవహారంపై తక్షణమే సభలో చర్చించాలని వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు తిరస్కరించడంతో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభ కార్యక్రమాలు జరుగకుండా స్తంభింపజేస్తున్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి. కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కనుకనే దానిని అజెండాలో చేర్చామని, కానీ దానిపై రేపు చర్చిద్దామని అధికార పార్టీ సభ్యులు వాదిస్తుంటే, దానిపై తక్షణమే చర్చ చేపట్టాలని వైకాపా సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తన పార్టీ నేతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని వైకాపా చేసిన ఆరోపణలతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తలు పెరిగాయి. ఊహించినట్లే వారి వాగ్వాదాలు వ్యక్తిగత విమర్శలకు దారి తీసాయి.
తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పందిస్తూ ఒక్క కాల్ మనీ వ్యవహారం గురించి మాత్రమే కాదు…ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితో కలిసి ఎవరు ఫొటోలు దిగారో కూడా రేపు సభలో చర్చిద్దామని వైకాపాకు సవాలు విసిరారు. వైకాపా తీరు చూస్తుంటే సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికే వచ్చినట్లుంది…మిగిలిన మూడున్నరేళ్ళు కూడా సభలో ఇలాగే వ్యవహరిస్తారా? అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సభలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీసినట్లు సమాచారం. ప్రస్తుతం సభలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎటువంటి చర్చ జరగకుండానే సభ కొంచెంసేపు వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.