హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు రాజేందర్ రెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో భారీస్థాయిలో ఏకంగా రు.18 కోట్ల నగదు పట్టుబడింది. బెంగళూరు, గుల్బర్గా నుంచి వచ్చిన ఐటీ అధికారులు నిన్న రాజేందర్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఒకేసారి దాడులు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాసం, మహబూబ్ నగర్లో ఆయన సోదరుడి నివాసం, కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న నివాసం, అక్కడే వీరికి ఉన్న నవోదయ వైద్య కళాశాల, నవోదయ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లోని నవోదయ ఆసుపత్రిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఆఫీస్ లాకర్లో రు.18 కోట్ల నగదు దొరికింది. తమ కళాశాలకు సంబంధించి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును ఆఫీస్ లాకర్లో పెట్టినట్లు చెబుతున్నారు. నిన్నరాత్రంతా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన పలు ఆస్తుల డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు, ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో, కర్ణాటకలో ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ కళాశాలలు నడిపే నవోదయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు రాజేందర్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయనకు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. వ్యవసాయంకూడా చేస్తుంటారు. 2014 ఎన్నికలలో ఈయన తన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల విలువ రు.29 కోట్లు మాత్రమే. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో ఐటీ అధికారులు దాడులు చేశారు.