వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా నామమాత్రమైన సుంకాలతో దిగుమతులకు గేట్లు తెరిచేశారు. మన రైతుల కాళ్ళు నరికేసి దిగుమతులతో పోటీ పడమంటున్నారు. దిగుమతులపై సుంకాలు తగ్గించి విదేశీ రైతులకు పరిశ్రమలకు లాభాలు ఇచ్చే విధానాలు స్వదేశీ రైతుల్ని చావుదెబ్బతీస్తున్నాయి. ఈ లిబరలైజేషన్ లో బిజెపి కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనిపిస్తోంది. గ్లోబలైజేషన్ అనర్ధాల్లో ఇదొక తాజా కథ. పెంచిన తోటల్నే నరికేసుకుంటున్న వ్యవసాయదారుల వ్యధ!
వంటనూనె పామోలిన్ ఆయిల్ ఉత్పత్తికి ముడిసరుకు అయిన పామ్ కాయల ధరలు పడిపోవడంతో ఆయిల్ పామ్ తోటలను రైతులు నరికేస్తున్న ధోరణి ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈ సాగుని శాశ్వతం ఆపేసి గిట్టుబాటయ్యే మరోపంటను వేసే ఆలోచనే తోటలను తీసెయ్యాడానికి కారణం. దేశంలో ఎపి, ఎపిలో తూర్పుపశ్చిమగోదావరి జిల్లాలూ, ఈ పంటను అధికంగా పండిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1లక్షా 50 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు వున్నాయి.
గత ఏడాది మార్చిలో టన్ను ఆయిల్‌పామ్ పండ్ల ధర 8,440 రూపాయలు కాగా, ఇపుడు 5,803 రూపాయలకు పడిపోయింది. వంట నూనెల డిమాండ్‌లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న నేపథ్యంలో పాతికేళ్ళక్రితం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో, ఇతర పంటల కన్నా ఆర్థికంగా అధిక ప్రయోజనాన్ని పొందవచ్చన్న ఉద్దేశ్యంతో ఆయిల్‌పామ్ సాగుమొదలైంది.
విదేశాల నుండి దిగుమతవుతున్న ముడి ఆయిల్‌పామ్‌పై గత యుపిఎ ప్రభుత్వం 80 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తే, ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వం ఆ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించింది. దీనివల్ల విదేశీ ముడి పామాయిల్ పోటీని తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పండ్ల ధర గణనీయంగా దిగజారింది. దిగుమతి సుంకాన్ని మరింత పెంచితే తప్ప, మన దేశంలో పండుతున్న ఆయిల్‌పామ్ పండ్ల ధర పెరిగే అవకాశం కనిపించడంలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా దిగుమతి సుంకాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఆయిల్‌పామ్ సాగును ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 2000-2001 సంవత్సరాల్లో ఇలాగే ఆయిల్‌పామ్ పండ్ల ధర దారుణంగా దిగజారినపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాన్ని (ఎంఐఎస్) అమలుచేసి, రైతులను ఆదుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అలాంటి ఎంఐఎస్‌ను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆయిల్‌పామ్ పరిశోధనా సంస్థ 2010లోనే టన్ను ఆయిల్‌పామ్ పండ్లకు కనీసం 8,500 రూపాయల ధర లభిస్తే తప్ప ఆయిల్‌పామ్ సాగు మనుగడ సాధ్యంకాదని చెప్పిందని, దానిని బట్టి చూస్తే నేటి పరిస్థితులకు అనుగుణంగా ధర కనీసం 10,000 రూపాయలుగా ఉండాలనేది రైతుల వాదన. చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెబుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ రైతులు తమ తోటలను తామే నరుక్కునే దుస్థితి ఏర్పడింది.