హైదరాబాద్: విజయవాడలో బయటపడిన కాల్‌మనీ వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న దూడల రాజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసిఉన్న ఫోటోను తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇవాళ బయటపెట్టారు. రాజేష్‌తో జగన్‌కు ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ విజయవాడ వచ్చినప్పుడల్లా అన్ని ఏర్పాట్లు చేసేది రాజేషేనని ఆరోపించారు.
జగన్ ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, దూడల రాజేష్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. అతను కాంగ్రెస్ కార్పొరేటర్‌గా పోటీచేసిన విషయం తెలుగుదేశం నేతలకు తెలుసని అన్నారు. అసెంబ్లీ కౌరవసభలాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కాల్‌మనీ గురించి మాట్లాడుతూ, మన ఇంట్లోని ఆడవాళ్ళకు ఇలా జరిగితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని అన్నారు. కాల్ మనీ ఆరోపణలు వస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు వైసీపీ పార్టీ శాసనసభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల ప్రతిపాదిస్తే స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండు రోజులు సస్పెండ్ చేశారని జగన్ ఆరోపించారు.