ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. సభా కార్యక్రమాలను రికార్డు చేస్తున్న కెమెరాలకు అడ్డుగా నిలబడి ఆటంకం కలిగిస్తున్నందుకు వైకాపా తుని ఎమ్మెల్యే రామలింగేశ్వరరావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డిలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా దానిని స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ఆమోదించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారంపై రేపు ఉదయం సభలో తను ప్రకటన చేస్తానని ఆ తరువాత సభ్యులు దానిపై చర్చించవచ్చని అన్నారు. కానీ వైకాపా సభ్యులు తక్షణమే దానిపై చర్చ చేపట్టాలని పట్టుబట్టడంతో స్పీకర్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసారు. కానీ వారు తమ పట్టు విడవకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. కనుక ఈరోజు శాసనసభ సభలోఒకరినొకరు విమర్శించుకోవడం ఎద్దేవా చేసుకోవడం మినహా ఎటువంటి చర్చా జరుగలేదు. రేపు చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంపై ప్రకటన చేసిన తరువాత బహుశః మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడవచ్చును.
కాల్ మనీ వ్యవహారంలో తెదేపా ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తున్నానని వైకాపా భావిస్తున్నట్లుంది. కానీ నిజానికి వైకాపాయే అధికార తెదేపాకి ఈ ఇబ్బందికరమయిన సమస్యపై సంజాయిషీ చెప్పుకొనే అవసరం లేకుండా చేసిందని చెప్పవచ్చును. ఈ వ్యవహారంపై చర్చ జరగాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడటం వలన తెదేపా తప్పించుకోగలిగింది. అలాగే మిగిలిన సమస్యలపై కూడా ప్రభుత్వం ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేకుండానే తప్పించుకొనే అవకాశం వైకాపాయే కల్పిస్తోంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తెదేపాను ఇరుకున పెట్టామని సంబరపడుతుంటే తెదేపా నేతలు ముసిముసినవ్వులు నవ్వుకోవడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. మిగిలిన నాలుగు రోజులు కూడా ఇలాగే వైకాపా సభ్యులు రెచ్చిపోతే మళ్ళీ బడ్జెట్ సమావేశాల వరకు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు.