మెగా ఫ్యామిలీ నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను చూపుతున్న హీరో వరుణ్ తేజ్. ముకుందతో ఎంట్రీ ఇచ్చినా రెండవ సినిమాగా తీసిన కంచె లాంటి ప్రయోగంతో ద్వితీయ విజ్ఞాన్ని కూడా సక్సెస్ ఫుల్ చేసుకున్నాడు. కొత్తదనంతో ఉరకలేస్తున్న వరుణ్ తేజ్ డేరింగ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘లోఫర్’. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అన్నది ఈనాటి మన సమీక్షలో చూద్దాం.
కథ :
డబ్బుపిచ్చి గల వ్యక్తి (పోసాని కృష్ణ మురళి) లక్ష్మిని (రేవతి) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె ఆస్తి కోసమే తనని పెళ్లిచేసుకున్నానని చెప్పి తనతో తెగించుకుని బయటకు వస్తాడు. వారిద్దరికి పుట్టిన బిడ్డ రాజా (వరుణ్ తేజ్) ని కూడా తనతో తీసుకువెళ్తాడు. ఇక ఒక తండ్రి కొడుకుని ఎలా పెంచకూడదో అలా లోఫర్ లా పెంచుతాడు పోసాని. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ కాలం గడిపేస్తుంటారు. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ కామెర్లతో చనిపోయిందని అబద్దం చెబుతాడు. ఇలా ఓ దొంతగతనంలో పారిజాతం అలియాస్ మౌని (దిశా పటాని) వారికి తారస పడుతుంది. మొదటి చూపులోనే ఆమెని రాజా ప్రేమిస్తాడు. ఆమెని ఇంప్రెస్ చేయడం కోసం వారి వృత్తి ధర్మాన్ని కూడా పక్కనపెడతాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మౌని తండ్రి ఓ కిరాతకుడు తన ఇద్దరన్నయలతో కలిసి రాయ్ పూర్ లో దందాలు చేస్తుంటారు. మౌనిని బలవంతంగా ఓ రెండో పెళ్లి కొడుకు స్పైడర్ బాబు (ఆలి)కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే కారణం చేత ఇష్టం లేక ఆమె జోధ్ పూర్ వస్తుంది. ఇక రాజా మౌనిలు ప్రేమలో పడటం మధ్యలో విలన్ గ్యాంగ్ రావడం ఇందంతా జరుగుతుంది. అయితే మౌని అత్తమ్మగా లక్ష్మి (రేవతి) కనిపించి రాజాకి షాక్ ఇస్తుంది. చనిపోయిన అమ్మ ఇలా తనముందుకు రావడంతో ఆశ్చర్యాంకితుడైతాడు రాజా.. విలన్లు తీసుకుపోయినా పారిజాతం రాజా ఎలా కలుసుకున్నాడు..? బ్రతికున్న తల్లి చెంతకు చేరాలనే తపనతో రాజా ఏం చేశాడు..? ఊళ్లో జనాలను ఇబ్బందులు పెడుతున్న ముకేశ్ రుషి ని రాజా ఎలా సంహరించాడన్నది అసలు కథ..
సాంకేతిక నిపుణత :
సినిమా ఎంత స్పీడ్ గా కానిచ్చినా టెక్నికల్ గా పర్ఫెక్ట్ అనిపించుకుంటాడు పూరి జగన్నాథ్. మరోసారి తన దర్శకత్వ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించాడు పూరి. సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా పనితనం బాగా కనిపించింది. సునీల్ కాశ్యప్ ఇచ్చిన సంగీతం సినిమాకు పర్వాలేదనిపించినా ఇంకాస్త మంచి ట్యూన్స్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. సువ్వీ సువ్వాలమ్మా సాంగ్ ఒక్కటి సునీల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. పూరి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్ సినిమాలో బాగా కనిపించేలా సినిమాను చాలా రిచ్ గా వచ్చేందుకు నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ :
మదర్ సెంటిమెంట్ తో పూరి ఓ కథ రాశాడంటే పూరి తీసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా మీదకే అందరి దృష్టి వెళ్తుంది. 25 ఏళ్ల తర్వాత తన అమ్మనికలుసుకోవడం కోసం ఓ కథ రాసుకున్న పూరి కథలో మిగతా విషయాలన్ని చాలా లైట్ గా రాశాడని చెప్పాలి. తండ్రి క్యారక్టర్ అసలు హీరో ని లోఫర్ గా ఎందుకు పెంచాలనుకుంటున్నాడో వివరణ ఇవ్వలేదు. మొదటి భాగం అంతా పేలవంగా నడించిన సినిమా సెకండ్ హాఫ్ అయినా ఊపందుకుంటుంది అంటే అది కూడా మదర్ సెంటిమెంట్ తో నింపేశాడు పూరి. కథ చాలా చిన్నది ఇలాంటి కథలు ఇదవరకే వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా లెంథ్ కూడా కాస్త ప్రేక్షకులను ఇబ్బందిపెట్టినట్టుంది. సినిమాలో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడు, వరుణ్ ని కమర్షియల్ హీరోగా చేయడంలో ఎట్టకేలకు పూరి సక్సెస్ అయ్యాడు. అయితే కథ, కథనాల్లో ఇంకాస్త పట్టు సాధించి ఉంటే సినిమా మంచి సినిమా అయ్యేది. తల్లి పాత్ర వేసిన రేవతి తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించింది. ముఖ్యంగా సువ్వు సువ్వాలమ్మా సాంగ్ సినిమాలో హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తం హీరోతో పాటుగా పోసాని పాత్ర కూడా మంచి ఎంటర్టైన్ నింపింది. అయితే సినిమాలో సప్తగిరి, ధన్ రాజ్ ఉన్నా కామెడీ అంతగా పండలేదు. ఇక స్పైడర్ బాబుగా ఆలి, శ్రీమంతుడుగా బ్రహ్మానందం పేలవమైన ప్రదర్శనను ఇచ్చారు. లోఫర్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ లేదనేది విశ్లేషణ.
ప్లస్ పాయింట్స్ :
వరుణ్ తేజ్ నటన
రేవతి
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనాలు
సినిమా నిడివి
ఫస్ట్ హాఫ్
తీర్పు :
మెగా ఫ్యామిలీ నుండి వచ్చి ప్రయోగాత్మక సినిమాలను తీస్తున్న వరుణ్ తేజ్ హీరోగా పక్కా కమర్షియల్ గా వచ్చిన సినిమా లోఫర్. పూరి మార్క్ టేకింగ్ తో వచ్చిన ఈ సినిమా కథలో పట్టులేకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోలేకపోతుంది. పూరి సినిమా కథ అనుకున్నప్పుడు రాసుకున్న మదర్ సెంటిమెంట్ సీన్స్ మాత్రమే తప్ప సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే అనిపిస్తుంది. ఇక ఎప్పటిలానే వరుణ్ తేజ్ తన నటనతో ఆకట్టుకుంటే, కొత్త అందం దిశా పటని ప్రేక్షకులను తన వల్లో వేసుకునే ప్రయత్నం చేసింది. సరదాగా సినిమా చూద్దాం అని అనుకునే వారికి నచ్చే సినిమా అవుతుంది. మాస్ హీరోగా అయితే వరుణ్ తేజ్ ని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కాని మరోసారి పేలవమైన కథ కథనాలతో పూరి రేంజ్ సినిమా ఇది కాదనిపించేలా చేసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్.
నటీనటులు : వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి, ముకేశ్ రుషి
సినిమాటోగ్రఫీ : పి.జి.విందా
సంగీతం : సునీల్ కశ్యప్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : సి.కళ్యాణ్
తెలుగు360 రేటింగ్ : 2/5