హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ, వాణిలకు శస్త్ర చికిత్స చేసి విడదీయటానికి ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్యులు ముందుకొచ్చారు. ఇవాళ ముగ్గురు సభ్యుల ఎయిమ్స్ వైద్యుల బృందం హైదరాబాద్ వచ్చి నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న వీణ-వాణిలను పరిశీలించి శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపింది. వీరిని విడదీయటానికి చేసే శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనదని ఆ వైద్యులు చెప్పారు. వారంలోగా ఢిల్లీ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు జరుపుతామని తెలిపారు. ఆపరేషన్ క్లిష్టమైనప్పటికీ తమ ప్రయత్నం తాము చేస్తామని చెప్పారు.
వీణ-వాణిల శస్త్రచికిత్స బాధ్యత తమదేనన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ శస్త్ర చికిత్స చేసే అవకాశాలను పరిశీలించాలని కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసింది. దానిపై స్పందించి ఎయిమ్స్ బృందం హైదరాబాద్ వచ్చింది. గతంలో లండన్‌కు చెందిన వైద్యులు వీరికి శస్త్ర చికిత్స చేయటానికి ముందుకొచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యతను ఎయిమ్స్‌కు అప్పగించింది. మరోవైపు వీణ-వాణిలకు ఆర్థిక సహాయం కోసమంటూ ప్రజలనుంచి విరాళాలు తీసుకుని వారి కుటుంబానికి ఇవ్వలేదంటూ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి.