హైదరాబాద్: బాలీవుడ్లో రేపు ఒకేరోజున రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఒకటేమో షారుక్ ఖాన్, కజోల్ జంటగా రోహిత్ షెట్టి దర్శకత్వంలో వస్తున్న ‘దిల్వాలే’ కాగా, మరొకటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్, ప్రియాంకచోప్రా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’. మొదటిదేమో రోహిత్ షెట్టి స్టైల్లోనే రూపొందిన యాక్షన్ మూవీ కాగా రెండోది చారిత్రక కథాంశంతో రూపొందినది. దిల్ వాలేను షారుక్ ఖాన్ సొంతంగా రు.140 కోట్లతో నిర్మించగా, బాజీరావ్ మస్తానీని భన్సాలీ ఎరోస్ సంస్థతో కలిసి రు.120 కోట్ల వ్యయంతో రూపొందించారు.
అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే దిల్వాలే చిత్రానికే జోరుగా సాగుతున్నాయి. అయితే బాజీరావ్ మస్తానీకోసం ఆ చిత్ర నిర్మాణసంస్థ ఎరోస్ దేశవ్యాప్తంగా అత్యధిక సింగిల్ స్క్రీన్లను చాలాకాలం క్రితమే బుక్ చేసి ఉండటం ఆ చిత్రానికి ఎడ్వాంటేజ్ అంటున్నారు(సింగిల్ స్క్రీన్ల వలన ఓపెనింగ్స్ బాగా వస్తాయి). ఓవర్సీస్లో కూడా బాజీరావ్ మస్తానీని అత్యధికంగా 850 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. బాజీరావ్ మస్తానీ కోసం అత్యధిక సింగిల్ స్క్రీన్లను ముందే బుక్ చేయటంవలన దిల్ వాలేకు యూపీ వంటి కొన్ని చోట్ల రిలీజ్ చేయటానికి ధియేటర్లు కూడా దొరకలేదు. దీనిని ఎదుర్కోవటంకోసం పీవీఆర్‌తో షారుక్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్కెటింగ్ విషయానికొస్తే షారుక్ ముందున్నాడు. షారుక్ ప్రమోషన్‌ను తీవ్రంగా చేశాడు. మత అసహనం వివాదం నేపథ్యంలో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమోనని క్షమాపణ కూడా చెప్పాడు. మరి ప్రేక్షకులు మిడిల్ ఏజ్ జంట షారుక్-కజోల్ను ఆదరిస్తారా, లేక ప్రస్తుతం హాట్ కపుల్‌గా ఉన్న రణ్వీర్-దీపికకు ఓటేస్తారా అన్నది తెలియాలంటే రేపటిదాకా ఆగాలి.