హైదరాబాద్: ఇటీవల జలప్రళయంతో కుదేలైన తమిళనాడులో, చెన్నై నగరంలో ఇప్పుడు అతి పెద్ద చర్చనీయాంశం ఏదైనా ఉందంటే అది బీప్ సాంగ్. కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్‌లో వెర్రెక్కించిన ‘కొలవెరి’ పాటను సంగీతం అందించిన అనిరుద్ ఈ పాటకు సంగీతం అందించాడని, యువహీరో సింబు పాడాడని ఆరోపణ. అయితే అనిరుద్(రజనీకాంత్ భార్య లతకు మేనల్లుడు) ఈ పాటతో తనకు సంబంధంలేదని, దానిని కంపోజ్ చేయలేదని చెప్పాడు. మరోవైపు సింబు మాత్రం దానిని తామిద్దరం రూపొందించిన మాట నిజమేనని, అయితే దానిని తాను ప్రైవేట్ సాంగ్‌గా రూపొందించుకున్నామని అన్నాడు. వీరిద్దరిపై కోయంబత్తూర్ నగరంలో మొదట, తర్వాత మరికొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. మహిళా సంఘాలు భగ్గున మండిపడుతున్నాయి. సినీ ప్రముఖులు కూడా పాటను తీవ్రంగా విమర్శించారు.
ఇంతకీ ఆ పాటలో ఏముందంటే, ఆడవాళ్ళ తీరుపై సాగిన ఆ పాటలో వారి శరీరావయవాలను అభివర్ణిస్తూ తీవ్రమైన అసభ్యపదజాలం వాడారు. పాటలో బూతులు వచ్చినప్పుడల్లా బీప్ అనే సౌండ్ వస్తుంది. అందుకే బీప్ సాంగ్ అన్నారు. ఇప్పుడు పోలీసులు సింబు, అనిరుద్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు హీరో ధనుష్‌కు కూడా ఈ వివాదం చుట్టుకునేటట్లుందని అంటున్నారు. రేపు విడుదలవుతున్న ధనుష్ కొత్త సినిమా తంగమగన్(తెలుగులో నవమన్మధుడు)కు సంగీతాన్ని అందించినది అనిరుద్ కావటంతో ఆ చిత్రం విడుదలయ్యే ధియేటర్లవద్ద ఆందోళనలు నిర్వహించాలని మహిళాసంఘాలు యోచిస్తున్నాయట. దీనితో ధనుష్ తలపట్టుకుని కూర్చున్నాడట. ప్రస్తుతం కెనడాలో ఉన్న అనిరుద్‌ను చెన్నై తిరిగి రాగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు. ఏది ఏమైనా వీరిపైన పెట్టిన సెక్షన్ల ప్రకారం వీరికి శిక్ష తప్పదని చెబుతున్నారు.