హైదరాబాద్: చంద్రబాబునాయుడు 1995లో తొలిసారి అధికారంలోకి రావటానికి హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హోటల్లోనే నాడు బాబు తన వర్గాన్ని దాచారు. ఎన్టీఆర్ ఈ హోటల్ ముందుకొచ్చి మైకులో ఆ ఎమ్మెల్యేలకు పిలుపునిస్తే ఆయనపైకి చెప్పులు విసిరారు. ప్రస్తుతం ఆ హోటల్ యాజమాన్యం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం బయటకొచ్చింది. ఈ హోటల్ అధినేత ప్రభాకరరెడ్డి తెలుగుదేశం తరపున రాజ్యసభ ఎంపీగా చేసిన విషయం విదితమే. ప్రభాకరరెడ్డికి ట్యాంక్‌బండ్ ఒడ్డునే వైస్రాయ్ మ్యారియట్తో పాటు కోర్ట్ యార్డ్ అనే మరో హోటల్ కూడా ఉంది. పి. ప్రభాకరరెడ్డి, పి.చక్రధర రెడ్డి, పి.కామేశ్వరి ప్రమోటర్లుగా ఉన్న వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్ కెనరా బ్యాంకుకు రు.28.24 కోట్లు, స్టేట్ బ్యాంకుకు రు.68.31 కోట్లు బకాయి ఉంది. ఇప్పుడు ఈ రుణాలు వడ్డీతో కలిసి బకాయిలు రు.100 కోట్లు దాటి ఉంటాయి. చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చినా రుణం చెల్లించనందున కోర్ట్‌యార్డ్ హోటల్‌కు చెందిన భవనాలు, యంత్ర సామాగ్రిని బ్యాంకులు అమ్మకానికి పెట్టాయి. జనవరి 4న బ్యాంకర్లు కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఆస్తులు చూపుతారు. జనవరి 19న ఆన్ లైన్(ఈ వేలం) పద్ధతిలో ఆస్తులను వేలం వేస్తారు. ఈ ఆస్తుల రిజర్వ్ ధర రు.94 కోట్లుగా బ్యాంకులు పేర్కొన్నాయి.