కాంగ్రెస్ పాలిత రాష్ట్రమయిన అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని రాజకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి నబం తుకి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని స్వంత పార్టీకి చెందిన 22మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీజేపీ సభ్యులతో కలిసి కూల్చే ప్రయత్నం చేసారు. వారందరూ కలిసి ముందుగా శాసనసభ స్పీకర్ నబం రెబియాపై అభిశంసన తీర్మానం ఆమోదించి ఆయనను పదవిలో నుంచి తొలగించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి నబం తుకి ప్రభుత్వంపై వారు అవిశ్వాసం ప్రకటించి, ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే ‘ఫుల్’ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నారు.
విచిత్రమయిన విషయం ఏమిటంటే ఈవిధంగా చేసేందుకు గవర్నర్ వారిని అనుమతించడం. ఆయన అనుమతితోనే వారు రాష్ట్ర శాసనసభకు తాళాలు వేసి ఈటా నగర్ లోని స్థానిక ఫుట్ బాల్ మైదానంలో గల కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకొన్నారు. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటునందునే నబం తుకి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించి, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొన్నామని వారు తెలిపారు.
ఈ సంఘటనలపై ముఖ్యమంత్రి నబం తుకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన తన ప్రభుత్వం అధికారంలో ఉండగా గవర్నర్ ఏవిధంగా శాసనసభకు తాళాలు వేసి, తిరుగుబాటు అభ్యర్ధులను స్పీకర్ ని అభిశంసించి తొలగించడానికి, తన స్థానంలో వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి అంగీకరించారని ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోడికి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు వ్రాసారు. రాజ్యాంగంలోని సెక్షన్ 174 ప్రకారం శాసనసభ సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రికి తెలియజేయవలసి ఉంటుందని కనీ రాష్ట్ర గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కొందరు తిరుగుబాటు అభ్యర్ధులను తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అనుమతించారని కనుక తక్షణమే ఈ వ్యవహారంలో కలుగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా తన లేఖలో విజ్ఞప్తి చేసారు.