ప్రఖ్యాత రంగ స్థల నటుడు చాట్ల శ్రీరాములు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఆయన గత కొంత కాలంగా అస్వస్థతో ఉన్నారు. రాష్ట్రంలో అనేక వందల మందికి నాటక రంగంలో శిక్షణ ఇచ్చి తెలుగు నాటక రంగానికి ఎనలేని సేవ చేసారు. ఆయన సినీ రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ, నాటకరంగానికి చెందినవారు ఆయనను గురుతుల్యులుగా గౌరవిస్తుంటారు.
చాట్ల శ్రీరాములు 1931లో విజయవాడలో జన్మించారు. ఆయన మొదట రైల్వే ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆయనే మొట్టమొదటి అనౌన్సర్‌గా పనిచేశారు. ఆ తరువాత నాటక రంగం మీద అభిరుచి పెంచుకొని 1976 నుంచి పూర్తిగా డానికే పరిమితమయ్యారు. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకి కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి ఎన్టీఆర్ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చాట్ల శ్రీరాములు మరణానికి సినీ నాటక రంగానికి చెందినవారు చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో మంచి అనుబంధం ఉన్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు సంతాపం తెలిపారు.