హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డితోసహా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ఏపీ అసెంబ్లీనుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటం వంటి పనులతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతుండటంతో వీరిని సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. వారందరి పేర్లు చదివిన స్పీకర్, అంబేద్కర్‌పై చర్చ పూర్తయ్యేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సభను వీడకుండా పోడియం ముందే నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కోడెల తన సీటునుంచి బయటకు వెళ్ళగా, ఆయన స్థానంలో వచ్చిన ప్యానెల్ స్పీకర్ విష్ణుకుమార్ రాజు వైసీపీ ఎమ్మెల్యేలందరినీ బయటకు పంపల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. మార్షల్స్ వైసీపీ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్ళారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. వాస్తవానికి కాల్‌మనీ వ్యవహారంపై అంబేద్కర్ 125వ జయంతోత్సవాల గురించి చర్చ తర్వాత మాట్లాడదామని ప్రభుత్వం ప్రతిపాదించగా, వైసీపీ ఎమ్మెల్యేలు బీఏసీ సమావేశంలో అంగీకరించారు. అయితే నిర్ణయం మార్చుకున్నారో, ఏమోగానీ సభలోమాత్రం ముందు కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరగాలని పట్టుపట్టారు.