హైదరాబాద్: కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రిక, ఆ సంస్థ యజమాని వేమూరి రాధాకృష్ణ అప్రకటిత యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ నిన్న ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్‌కు స్వయంగా ఫోన్ చేశారు. తాను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా రాధాకృష్ణను ఆహ్వానించారు. యాగం విశేషాలు తెలుపుతూ సతీసమేతంగా హాజరు కావాలని కోరారు. మెదక్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్ ఆవరణలో భారీస్థాయిలో చేస్తున్న ఆయుత చండీయాగానికి కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరనుంచి దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును స్వయంగా విజయవాడ వెళ్ళి మరీ ఆహ్వానించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్, దినపత్రికల అధిపతులను కూడా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారని, దానిలో భాగంగానే వేమూరి రాధాకృష్ణకు కూడా ఫోన్ చేశారని తెలిసింది.
తమ పార్టీపై, ప్రభుత్వంపై విపరీతంగా వ్యతిరేక కథనాలు ఇస్తున్న ఆంధ్రజ్యోతి అంటేనే టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భగ్గున మండిపడుతుంటాయి. అయితే కేసీఆర్‌కు, రాధాకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా గతంలో మంచి సంబంధాలు ఉండేవి. గతంలో కేసీఆర్‌ను ఇంటర్వ్యూ చేసేటపుడు రాధాకృష్ణ చనువుగా నువ్వు, నువ్వు అనే సంబోధించేవారు. ఏబీఎన్ ఛానల్‌పై నిషేధాన్ని సుప్రీంకోర్ట్ ఎలాగూ తొలగించింది కాబట్టి ఈ యాగం పుణ్యమా అని వీరిద్దరి మధ్య మళ్ళీ స్నేహసంబంధాల పునురుద్ధరణ జరుగుతుందేమో చూడాలి.