హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అరుదైన గౌరవం దక్కిందని, ప్రతిష్ఠాత్మక షికాగో యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిందని, ఆ యూనివర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రదానం చేయటం ఇదే మొదటిసారని నిన్న వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక-ఆర్థిక సంస్కరణలతో రైతులు, మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, హుద్‌హుద్ తుపానును సమర్థంగా ఎదుర్కొన్నారని, 2029 నాటికి ఏపీని దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టటానికి ఒక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ఈ కృషికి గుర్తింపుగానే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని షికాగో వర్సిటీ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు తనకు డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించానని, అయితే షికాగా విశ్వవిద్యాలయం చరిత్ర చూసి అంగీకరించానని చెప్పారు. ఈ వర్సిటీ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వారి డాక్టరేట్ స్వీకరించటంవల్ల మన కొత్త రాష్ట్రానికి గుర్తింపు వస్తుందని, ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తనకు వీలున్న తేదీల్లో దానిని ప్రదానం చేయటానికి అంగీకరించారని, తాను వచ్చినపుడే కాన్వొకేషన్ నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెప్పినట్లు తెలిపారు.
అయితే ఈ డాక్టరేట్ వెనక కొత్త ట్విస్ట్ బయటపడింది. షికాగో యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటైన ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’ కాదని, ఇది ఇల్లినాయిస్ రాష్ట్రప్రభుత్వం నడిపే ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ అని పరిశీలనలో తేలింది. ఈ యూనివర్సిటీలో చదివేవారిలో 75% మంది ఆఫ్రికన్ అమెరికన్స్, 7% స్వానిష్ వారు, 3% శ్వేతజాతీయులు ఉంటారు. ఈ యూనివర్సిటీ వివిధ ర్యాంకింగ్స్‌లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’కు ఎన్నోరెట్లు దిగువన ఉంటుంది. షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువారైన దేవిశ్రీ వి.పొట్లూరి కీలక బాధ్యతలు పోషిస్తున్నారని, ఆయనే చంద్రబాబుకు ఈ డాక్టరేట్ వచ్చేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. చంద్రబాబు బృందం కూడా ఈ యూనివర్సిటీని యూనివర్సిటీ ఆఫ్ షికాగోగా పొరపాటుపడి ఈ థర్డ్ గ్రేడ్ యూనివర్సటీ డాక్టరేట్ తీసుకోవటానికి ఒప్పుకుని ఉండొచ్చన్న వాదన వినబడుతోంది. అమెరికా యూనివర్సిటీ అనగానే గొప్పవని అనుకోవటం సహజం. అయితే అమెరికాలో కూడా బోగస్ యూనివర్సిటీలు కూడా ఉంటాయని, ట్రైవ్యాలీ, యూనివర్సటీ ఆఫ్ నార్త్ వర్జీనియా వంటి విశ్వవిద్యాలయాల బాగోతం బయటపడిందని, నాలుగేళ్ళక్రితం ట్రైవ్యాలీ బోగస్ యూనివర్సిటీ చేసిన మోసంలో తెలుగువారు కూడా బాధితులుగా ఉండటం, వారికి అక్కడ కొనసాగే అవకాశం లేకపోవటంతో పోలీసులు వారికి రేడియో కాలర్లు వేయటం గురించి మర్చిపోయినట్లున్నారు.