డిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్తుడు మూడేళ్ళ నిర్బంధం (శిక్ష) పూర్తి చేసుకోవడంతో డిశంబర్ 20వ తేదీన విడుదలవుతున్నాడు. ఈ మూడేళ్ళు బాలనేరస్థుల గృహంలో ఉన్నపుడు అతను ‘డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుళ్ళ కేసు’లో శిక్ష అనుభవిస్తున్న మరొక బాలనేరస్తుడితో స్నేహం చేస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడని నిఘా వర్గాలు డిల్లీ హైకోర్టుకి తెలియజేసాయి. అతనిలో నేర ప్రవృతి పెరిగినట్లు కేంద్రప్రభుత్వం కూడా దృవీకరించి, అతని శిక్షను మరికొంత కాలం పొడిగించమని హైకోర్టుని కోరింది. అటువంటి నేర ప్రవృతి ఉన్నవ్యక్తిని సంస్కరించకుండా సమాజంలోకి పంపినట్లయితే అతని వలన సమాజానికి ఇంకా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక అతనిని విడుదల చేయవద్దని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. నిర్భయ (జ్యోతీ సింగ్) తల్లి తండ్రులు కూడా అతనిని విడుదల చేయవద్దని కోర్టుని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని అభ్యర్ధించారు.
సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన డిల్లీ హైకోర్టు, బాలనేరస్తుడి శిక్షను ఇంకా పొడిగించలేమని తీర్పు ప్రకటించింది. కనుక అతను ఎల్లుండి అంటే ఆదివారంనాడు బాల నేరస్తుల గృహం నుండి విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చును. నిర్భయ తల్లి, తండ్రులు, పలు ప్రజా సంఘాలు కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. డిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎవరయినా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే తప్ప అతనిని ఇంకా నిర్బంధించడం సాధ్యం కాకపోవచ్చును. 16-18సం.ల వయసు గల అటువంటి నేరస్తులని పెద్దవారితో సమానంగా శిక్షించేందుకు కేంద్రప్రభుత్వం బాల నేరస్తుల చట్టంలో సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో మెజార్టీ ఉంది కనుక దానిని ఆమోదించగలిగింది. కానీ రాజ్యసభలో తగినంత బలం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అంశం భుజానికెత్తుకొని సభను స్తంభింపజేస్తుండటంతో ఆ చట్టం ఇంకా ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పుడు హైకోర్టు అతని విడుదలకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో అంత తీవ్రమయిన, హేయమయిన నేరం చేసినప్పటికీ అతను చిన్నపాటి శిక్షతో తప్పించుకోగలుగుతున్నాడు. మిగిలిన వారికి కోర్టు మరణదండన విధించింది. కానీ దానిపై కూడా సుప్రీం కోర్టులో కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.