హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీనుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించగా స్పీకర్ దానిని మూజువాణి ఓటింగుకు పెట్టారు. తర్వాత ఆ తీర్మానాన్ని ఆమోదించటంతో రోజాపై సస్పెన్షన్ ఓటు పడినట్లయింది.
ఇవాళ మధ్యాహ్నం కాల్‌మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన బెంచీవైపు దూసుకెళ్ళి కాల్‌మనీ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ప్రారంభించారు. రోజా అయితే నేరుగా ముఖ్యమంత్రి సీటు దగ్గరికి వెళ్ళి అనుచిత పదాలతో వ్యాఖ్యలు చేశారు. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా భగ్గుమన్నారు. ఒక్కసారిగా సీట్లనుంచి లేచి అరుపులు పెట్టారు. ఒకరిద్దరు రోజాపై దూసుకెళ్ళబోగా చంద్రబాబు వారిని వారించారు. ముఖ్యమంత్రిపైనే దౌర్జన్యం చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. తాను 35 ఏళ్ళుగా శాసనసభ్యుడుగా ఉన్నానని, ఏరోజూ ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిపైకి వెళ్ళటం చూడలేదని చంద్రబాబు అన్నారు.