“ప్రతిపక్షాలలో మాట వినని వారి పని పట్టమని కేంద్రం తమను ఆదేశించినట్లు నాకు ఒక సీబీఐ అధికారి నిన్న చెప్పారు,” అని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ మెసేజ్ పెట్టడం కలకలం సృష్టిస్తోంది. అధికారంలో ఉన్నవాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికో లేక లొంగ దీసుకోవడానికో దర్యాప్తు సంస్థలను ఈవిధంగా దుర్వినియోగించడం కొత్త విషయమేమీ కాదు. కానీ ఆ విషయాన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా బహిర్గతం చేయడమే విశేషం. కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల వలన ఆయనే చిక్కులో పడే అవకాశం ఉంది.
డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసినప్పటి నుండి కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంటే ఆయనకి జవాబు చెప్పుకోలేక కేంద్రం చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఇప్పుడు ఆయనే కేంద్రప్రభుత్వానికి ఒక మంచి ఆయుధం అందించినట్లయింది. ఆయనతో ఆ మాట అన్న సిబీఐ అధికారి పేరు చెప్పమని కేంద్రం ఒత్తిడి చేసినట్లయితే కేజ్రీవాల్ చాలా ఇరకాటంలో పడతారు. చెపితే సదరు అధికారి ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంది చెప్పకపోతే కేజ్రీవాల్ అబద్ధాలు చెపుతున్నారనే బీజేపీ వాదనకు బలం చేకూరుతుంది. అయితే దేనిని తెగే వరకు లాగకూడదనే విషయం మరిచిపోయి ఈ వ్యవహారాన్ని కేజ్రీవాల్ అనవసరంగా ఇంకా సాగదీస్తున్నట్లు కనబడుతోంది. దాని వలన ఊహించని సమస్యలు ఎదురయితే అప్పుడు వాటి నుండి బయటపడేందుకు మరో కొత్త యుద్ధం ఆరంభించవలసి వస్తుంది. ఇటువంటి విషయాలలో ఎంతవరకు వెళ్ళాలనే విషయంపై ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా తీసుకొంటే మంచిదేమో?