ఫోకస్
వీడు చట్టం దృష్టిలో పిల్లవాడు కావచ్చు. కానీ సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషి. 2012నాటి నిర్భయ (జ్యోతి సింగ్) కేసులో మొత్తం ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో ఈ బాలనేరస్థుడు కూడా ఉన్నాడు. ఈ కేసు విచారణ జరిగే సమయానికి వీడి వయసు 18ఏళ్లకు కొద్ది నెలలు తక్కువ. ఈ కారణంగా ఇతణ్ణి బాలనేరస్థుడిగానే పరిగణించారు. మానసిక పరివర్తన కోసం జువెనైల్ హోమ్ కి తరలించారు. అతనిలో పరివర్తనకుగాను లీగల్ గా కేటాయించిన సమయం పూర్తికావస్తున్నది. కనుక, పరివర్తన హోమ్ లో ఇక ఉంచడం కుదరదు. డిసెంబర్ 20 (ఆదివారం) తర్వాత అతణ్ణి బాహ్య ప్రపంచంలోకి వదిలిబెట్టాలి. చట్టపరంగా చూస్తే ఇదంతా సబబే. కానీ ఈ రేపిస్ట్ లో మానసిక పరివర్తన కలిగినట్లు కనిపించడంలేదు. ఇలాంటి మృగాన్ని సభ్యసమాజంలోకి వదిలిపెడితే పౌరులకు భద్రత ఉండదన్న భావన సర్వత్రా నెలకొన్నది. అందుకే, బిజెపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలుచేస్తూ, ఈ రేపిస్ట్ విడుదలపై స్టే విధించాలనీ, నేరస్థుడ్ని మరో మూడేళ్లు అక్కడే (జువెనైల్ గృహంలోనే) ఉంచాలని కోరారు. కానీ హైకోర్టు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరిధిలో తీర్పుచెబుతూ, సాధ్యంకాదని తేల్చిచెబుతూ, పిటీషన్ కొట్టేసింది. దీంతో మానవమృగం బయటకు రావడాన్ని తలుచుకుంటూ అంతా భయపడుతున్నారు. ఈ కేసులో మిగతా ఐదుగురిలో ఒకతను జైల్లో మరణించగా, మిగతా నలుగురికి మరణశిక్ష విధించారు. ఇక మిగిలింది వీడే.
మహిళా సంఘాలు, మానవతా వాదులు, సామాజిక కార్యకర్తలు …ఇలా అనేకమంది ఈ మానవ మృగాన్ని బయటకు పంపకూడదనే అంటున్నారు. అయితే ప్రస్తుతం అమల్లోఉన్న చట్టం ప్రకారం ఇది అనివార్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా ఆశలు అడుగంటలేదనే చెప్పాలి. అందుకే ఢిల్లీ ప్రభుత్వం, మహిళా సంఘం ఆఖరి క్షణంవరకూ లీగల్ పోరాటం చేయాలనే సంకల్పించుకున్నాయి.
ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ (డిసిడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ చివరాఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆమె, భారత ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి లేఖలు రాస్తూ , ఈ మానవ మృగాన్ని సభ్యసమాజంలోకి పంపించకూడదంటూ విజ్ఞప్తి చేశారు. వాడిలో (మానవ మృగంలో) నిజంగా పరివర్తన వచ్చినట్లు సంపూర్ణ విశ్వాసం వచ్చేదాకా వదిలిపెట్టకూడదన్నదే ఆమె లేఖల్లోని సారాంశం. ఢిల్లీ హైకోర్టు తీర్పుని ఆమె `డార్క్ డే’గా అభివర్ణిస్తూనే, చట్టాలను మార్చాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జెజెబీ) ప్రధాన మాజిస్ట్రేట్ కు కూడా ఆమె లేఖ రాశారు. ఈ లేఖలు సత్ఫలితాన్ని ఇస్తాయనీ, ప్రత్యేక అధికారులు ఉపయోగించి `పెద్దలు’ తగు న్యాయం చేస్తారని ఆమె భావిస్తున్నారు.
జువెనైల్ (బాలపరిధి) వయస్సుని అసాధారణ కేసుల్లోనైనా 18 నుంచి 16ఏళ్లకు కుదించాలన్న సవరణతో కూడిన `జువెనైల్ జస్టిస్ అమెండ్మెంట్ బిల్’ ప్రస్తుతం రాజ్యసభ దగ్గర ఆగిపోయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకుని ఈ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలి. ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని నిర్భయ తల్లిదండ్రులతో సహా అనేకమంది కోరుతున్నారు.
మానసిక పరివర్తన కలిగినట్లు రూఢీ అయ్యేదాకా ఈ దోషిని పర్యవేక్షణ హోమ్ లో కొనసాగనివ్వాలనీ, వాడిలో పరివర్తన కలిగే దిశగా కౌన్సిలింగ్ ఇప్పించాలని చాలా మంది కోరుతున్నారు.
అయితే హైకోర్ట్ మాత్రం అతణ్ణి వదిలివేయాల్సిందేనంటూ ప్రస్తుతమున్న చట్టాల ఆధారంగా తీర్పుచెప్పిన నేపథ్యంలో మరి ఈ చివరాఖరి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
– కణ్వస