నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను దారి మళ్లించిన కేసులో ముద్దాయిలుగా పేర్కొనబడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలు నేడు డిల్లీలోని పాటియాలా కోర్టులో జరిగే విచారణకు స్వయంగా హాజరు కాబోతున్నారు. వారిరువురిని విచారణకు హాజరుకమ్మని కోర్టు ఆదేశించినపుడు, తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు కూడా వారు తప్పనిసరిగా కోర్టులో విచారణకు హాజరు కావలసిందేనని తేల్చి చెప్పింది.
తమపై మోడీ ప్రభుత్వం ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని స్తంభింపజేసింది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని స్తంభింపజేస్తోందని, ఆ విధంగా చేస్తూ పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా న్యాయవ్యవస్తను కూడా ఒత్తిడికి గురి చేసే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది.
ఈ కేసులో విచారణకు హాజరవుతున్న సోనియా, రాహుల్ గాంధీలకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, పార్టీలో సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తూ బారీ ఊరేగింపుగా పాటియాలా కోర్టుకి చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఆవిధంగా చేసినట్లయితే కోర్టుపై ఒత్తిడి తేవడానికే ప్రయత్నించినట్లు న్యాయమూర్తి భావించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కేసును వాదిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మరియు సీనియర్ లాయర్ అభిషేక్ స్వింగ్వి హెచ్చరించడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదన విరమించుకొన్నట్లు తెలుస్తోంది.కొద్ది మంది ఎంపిలను వెంటబెట్టుకొని కోర్టుకి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఒకవేళ కోర్టు తమకు జైలు శిక్ష విధించినట్లయితే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోకూడదని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా మోడీ ప్రభుత్వం తమను రాజకీయ వేధింపులకి గురి చేస్తోందనే భావన దేశ ప్రజలకు కలిగించవచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.