నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పార్లమెంటు ఉభయసభలని స్తంభింపజేస్తుండటంతో ఈ శీతాకాల సమావేశాలలో ఇంతవరకు ఒక్క బిల్లు కూడా ఆమోదానికి నోచుకోలేదు. ప్రతిపక్షాలను ఒప్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ లను తన ఇంటికి టీ సమావేశానికి ఆహ్వానించి మాట్లాడినా కూడా ఫలితం కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు నిత్యం పార్లమెంటు స్తంభింపజేస్తూనే ఉన్నాయి.
ఆఖరి ప్రయత్నంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆయన ప్రయత్నం ఫలించింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులలో ఒక్క జి.ఎస్.టి. బిల్లుకి తప్ప మిగిలిన వాటిలో చాలా బిల్లుల ఆమోదానికి సహకరిస్తామని మాట ఇచ్చేయి. జి.ఎస్.టి. బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిలో కొన్నిటికి మోడీ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ జి.ఎస్.టి. పెంపు ద్వారా రాష్ట్రాలకు కలిగే నష్టపరిహారాన్ని మొత్తం తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనకు మోడీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో జి.ఎస్.టి. బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ శీతాకాల సమావేశాలలో జి.ఎస్.టి. బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనబడటం లేదు.