నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ని కోట్లు చేతులు మారాయో…అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. కానీ ఆ కేసు పుణ్యమాని గత రెండు వారాలుగా పార్లమెంటు స్తంభించిపోయింది. ఒక్క బిల్లు పాసయితే ఒట్టు. ఈ రెండు వారాలలో పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు దూషించుకోవడానికే సరిపోయింది. ఆ తల్లి కొడుకుల సమస్య దేశ సమస్యగా పార్లమెంటు నిర్వహణకు ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో తెలియదు. “రాజు వెడలె రవి తేజములరియగా…కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరియగా” అన్నట్లుగా ఆ తల్లి కొడుకులిరువురూ కాంగ్రెస్ జీవులందరినీ వెంటబెట్టుకొని ఈరోజు కోర్టుకి కదిలివస్తునప్పుడు వారి భద్రత కోసం భారత ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులలో ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో ఆ లెక్కలు మోడీ ప్రభుత్వానికే తెలియాలి.
భారతదేశంలో నేటికీ కోట్లాది మంది ప్రజలు ఒక్కపూట తిండికి నోచుకోకపోతున్నా ఇటువంటి మహానేతల రక్షణ కోసం కప్పాలు కట్టక తప్పడం లేదు. అయితే తిండికి నోచుకోని వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారని అనేసుకోనవసరం లేదు. వారి కోసం ఇందిరా గాంధీ ఆనాడే ‘గరీబ్ హటావ్’ అని నినదించారు. ఇప్పటికీ మన నేతలు ఏదో క్యాచీ పేర్లు పెట్టుకొని నినదిస్తూనే ఉన్నారు. పేదల కోసం అనేక స్కీములు పెడుతూనే ఉన్నారు. కానీ గిట్టని వాళ్ళు ఆ తల్లి కొడుకుల కోసం ఇంత ఖర్చా? ఆ ఈ ‘ఇద్దరు బాధితుల’ కోసం పార్లమెంటు ఇంత బారీ మూల్యం చెల్లించాలా? అని బుగ్గలు నొక్కుకొంటూ తెగ ఫీలయిపోతున్నారు. అయితే నేటి ‘బెయిల్ విజయాన్ని’ ‘ధర్మ విజయంగా’ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ భావిస్తున్నారు కనుక రేపటి నుంచి వారందరూ రెట్టించిన సమరోత్సాహంతో పార్లమెంటుని స్తంభింపజేయవచ్చును. దానిని ఎవరయినా తప్పుగా భావిస్తే వారి అజ్ఞానానికి ఒక చిర్నవ్వు నవ్వి ఊరుకోవలసిందే. అదే న్యాయం.ధర్మం కూడా!