హైదరాబాద్: నిన్న ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిన నటుడు రంగనాథ్ చనిపోతూ కూడా తన సహృదయతను, మానవత్వాన్ని చాటుకున్నారు. చివరి కాలంలో ఇంట్లో తనకు సేవలందించిన పనిమనిషికి రు.2 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఆమెను ఇబ్బంది పెట్టొద్దని ఇంట్లోని గోడలపై రాశారు. ఆ రెండు లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బులు తన బ్యాంక్ ఎకౌంట్లో ఉన్నాయని, వాటి బాండ్లు తన బీరువాలో ఉన్నాయని, వాటిని ఆమెకు అందజేయాలని సూచించారు. దేవుడి పటాలపై డెస్టినీ అని రాశారు. సూసైడ్ నోట్ రాస్తే అది మిస్ అవుతుందని, గోడలపై రాస్తే అందరికీ తప్పనిసరిగా కనబడుతుందనే ఉద్దేశ్యంతో రంగనాథ్ ఇలా చేసినట్లు అనిపిస్తోంది. పనిమనిషిని విలేకరులు పలకరిస్తే కన్నీరు మున్నీరవుతోంది. ఆయన దేవుడేనని అంటోంది. కంటి వెంట చుక్కయినా రాల్చని రంగనాథ్ సంతానం కంటే పని మనిషే ఎక్కువగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన మృతదేహానికి ఇవాళ సాయంత్రం బన్సీలాల్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎటువంటి వివాదాలు, మచ్చలూ లేని మంచి నటుడైన రంగనాథ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవటంపై తెలుగు ప్రేక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.