హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీటువద్దకు వెళ్ళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి, ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ముందెన్నడూ తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సస్పెన్షన్ విధించిన దాఖలాలు లేకపోవటంతో, ఈ అనూహ్య పరిణామం రాజ్యాంగబద్ధమేనా అనే చర్చ మొదలయింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి ఇది సబబు కాదనే అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎథిక్స్ కమిటీ మొత్తం విషయాన్ని పరిశీలించి ఆరునెలల సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిందని తెలిపారు. అయితే ఆ కేసుకు, ఈ కేసుకు సంబంధం లేదని అన్నారు. చట్టసభల స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదని చెప్పారు. సభా నిబంధనలు ఎలా ఉన్నా, సమయం, సందర్భాలను బట్టి నిర్ణయాలు చేసే సంప్రదాయం సభకు ఉందని అన్నారు.
ఏడాదిపాటు రోజాను సస్పెండ్ చేయటం మంచి సంప్రదాయం కాదని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయని అన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ, రోజమ్మను సంవత్సరంపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేదని అన్నారు. సభా నిబంధనల పుస్తకంలోని 340వ నిబంధనను జగన్ చదివి వినిపించారు. ఆర్థికమంత్రి యనమల ఈ వాదనను తోసిపుచ్చారు. సస్పెన్షన్‌పై ఎలాంటి చర్చ అవసరం లేదని, సభా నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. లోక్‌సభలో జేఎమ్ఎమ్ సభ్యులను పదవీకాలమంతా సస్పెండ్ చేశారని, తమ పార్టీనేత కరణం బలరాంను ఎక్కడో ప్రకాశం జిల్లాలో స్పీకర్‌ను విమర్శించారని 6 నెలలు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. సస్పెన్షన్ నిర్ణయం ఏ ఒక్క సభ్యుడో తీసుకున్నదికాదని, అది సభ నిర్ణయమేనని, అసభ్య పదజాలం వాడిన సభ్యులను సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందని యనమల తేల్చి చెప్పారు. శాసన సభ ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరకీ లేదన్నారు.
గతంలో దీర్ఘకాలం అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన యనమల రామకృష్ణుడుకు శాసనసభ వ్యవహారాలు, నిబంధనలు కొట్టిన పిండి అని పేరుంది. స్వతహాగా న్యాయవాది కావటంతో ఆయనకు ఈ నిబంధనలన్నింటిపైన క్షుణ్ణంగా అవగాహన ఉంది. కాబట్టి సస్పెన్షన్ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందనటంలో సందేహం అవసరంలేదు. దానికితోడు ప్రజాస్వామ్యంలో చట్టసభల వ్యవహారాలలో జోక్యం చేసుకునే అధికారం న్యాయవ్యవస్థకు కూడా ఉండదు కాబట్టి ఈ సస్పెన్షన్ విషయంలో ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. కాకపోతే ఇది ఒక కొత్త చెడు సంప్రదాయానికి తెరతీస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే వారు ఈ నిబంధనలను ఉపయోగించుకుని ప్రతిపక్ష సభ్యులను ఇలాగే సస్పెండ్ చేస్తే ఇదే పద్ధతి కొనసాగుతుందనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా రోజా ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వెళ్ళి అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం కాస్త శృతి మించినట్లుందనే చెప్పాలి.