హైదరాబాద్: నాని, సురభి హీరో హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్ సంఘీ దేవాలయంవద్ద యూనిట్‌లోని ఒక వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుపతిరావు అనే ఈ వ్యక్తి లైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడని, శేరిలింగంపల్లిలో నివశిస్తుంటాడని తెలిసింది. ఇతను నిన్న లైటింగ్ అమరుస్తుండగా, ఒక లూజ్ కేబుల్ తాకి షాక్‌కు గురయ్యాడు. హయత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో యూనిట్ సభ్యులు అతని మృతదేహాన్ని అక్కడనుంచి తరలించటానికి ప్రయత్నించగా, ఈ లోపు పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ షూటింగ్‌కు అనుమతి ఏమీ తీసుకోలేదన్న విషయం తర్వాత బయటపడింది. తమనుంచి అనుమతి తీసుకోకుండానే షూటింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. మరోవైపు మృతుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో బాలకృష్ణతో ఆదిత్య 369 చిత్రాన్ని నిర్మించిన కృష్ణప్రసాద్(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోడల్లుడు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమయింది.