హైదరాబాద్: తెలుగుదేశం నేత పరిటాల రవి హత్యకేసులో 17వ ముద్దాయిగా, దోషిగా రుజువైన వెంకటస్వామి అనే వ్యక్తిని నిన్న మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఇటీవల తుపాకులు కలిగిఉన్న నిందితుల అరెస్ట్ సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకటస్వామి 9ఎమ్ఎమ్ తుపాకి, 3 తూటాలతో పట్టుబడ్డాడు. పరిటాల హత్యకేసులో జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. సిద్దిపేట ప్రాంతంలో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు చేసేందుకుగానూ కాన్పూర్ వెళ్ళి అక్కడ సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రెండు తుపాకులు కొన్నాడని, ఒకటి తనవద్ద ఉంచుకుని మరొకటి అమ్మేశాడని పోలీసులు తెలిపారు.
పరిటాల రవి హత్యకు ముందు జరిగిన అతని అనుచరుడు రాజ్‌కుమార్ హత్య కేసులో వెంకటస్వామి నిందితుడని, ఆ కేసులో జైలుకెళ్ళినపుడు మద్దెలచెర్వు సూరి, మొద్దుశీను, పటోళ్ళ గోవర్దనరెడ్డి పరిచయమయ్యారని పోలీసులు చెప్పారు. పరిటాల హత్యకు నిర్వహించిన రెక్కీలో వెంకటస్వామి పాల్గొన్నట్లు రుజువై మరోసారి జైలుకెళ్ళాడని తెలిపారు. ఇతను ప్రస్తుతం మెదక్ జిల్లా సంగటూరు మండలంలోని స్వగ్రామం వెల్లటూరులో కల్లు దుకాణంకూడా నడుపుతున్నట్లు వెల్లడించారు.