హైదరాబాద్: 2012 డిసెంబర్ 16 నాటి నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని బాలనేరస్థుడు అతి తక్కువ శిక్షను పూర్తి చేసుకుని ఇవాళ విడుదలయ్యాడు. ఢిల్లీలో అతనిని ఇన్నాళ్ళుగా బందీగా ఉంచిన తిమర్పూర్ రిఫార్మ్స్ హోమ్‌నుంచి ఒక గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. అతను ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటాడని చెబుతున్నారు. మరోవైపు గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ(జ్యోతి సింగ్) తల్లిదండ్రులు బాల నేరస్థుడి విడుదలకు నిరసనగా ఇండియా గేట్ దగ్గర ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలో పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఇఫ్ యు ఆర్ అండర్ 18, కమ్, రేప్ అజ్ అండ్ వాక్ ఎవే అంటూ పోస్టర్లు పట్టుకుని ఇండియా గేట్ దగ్గర యువతులు ఆందోళన చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై నిరసనలు భగ్గుమన్నాయి. బాలనేరస్థుడి విడుదలకు నిరసనగా, బాలనేరస్థులకు అతితక్కువ శిక్ష విధించే చట్టాలను మార్చమని కోరుతూ ట్విట్టర్లో #Istandwithnirbhaya, #passthebill అగ్రస్థానంలో ట్రెండ్ అవుతున్నాయి.