హైదరాబాద్: ‘మా టీవీ’లో నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి రు.25 లక్షలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబితే ఇచ్చే మొత్తం కోటి రూపాయలు అయినప్పటికీ ఇప్పటివరకు విజేతలు అందుకున్న గరిష్ఠమొత్తం రు.12.50 లక్షలుగానే ఉంది. అయితే నిన్న ప్రసారమైన కార్యక్రమంలో మొదటిసారిగా ఒక వ్యక్తి రు.25 లక్షలు గెలుచుకున్నారు. ఆ వ్యక్తి పాక్షిక అంధుడు కావటం విశేషం. ఆయన పేరు, జీవితం కూడా విచిత్రంగానే ఉంది. రావణ్శర్మ అనే ఆ 60 ఏళ్ళ వ్యక్తి హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ప్రాంతంలో ఉంటారు. గతంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పనిచేసిన శర్మ 2004లో కంటిచూపు క్షీణించటంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన కంటిచూపు 70 శాతం కోల్పోయి 30 శాతంతోనే నెట్టుకొస్తున్నారు.
రావణ్ శర్మ నిన్న ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మొత్తం 15 ప్రశ్నలలో 13 ప్రశ్నలకు సమాధానమిచ్చి రు.25 లక్షలు గెలుచుకున్నారు. రు.50 లక్షల 14వ ప్రశ్నకు సమాధానం తెలియకపోవటంతో క్విట్ అయ్యి రు.25 లక్షలతో సరిపుచ్చుకున్నారు. అయితే ఆ ప్రశ్నకు ఆయన ఊహించిన సమాధానం కరెక్టేనని తర్వాత తేలింది. అక్టోబర్ 17న మాటీవీ ఆడిషన్ పూర్తయిందని, నవంబర్ 16న ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌కు సెలక్ట్ అయ్యానని రావణ్ శర్మ నిన్న నిజామాబాద్ ఎల్లారెడ్డిలో చెప్పారు. ఆయన ప్రతి ఆదివారం ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటకు చెందిన విద్యార్థులకు ప్రతి ఆదివారం స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఉచిత శిక్షణ ఇస్తూ ఉంటారు. ఉద్యోగంనుంచి బయటకొచ్చిన తర్వాత లభించిన బెనిఫిట్స్ అన్నీ ఖర్చయిపోవటంతో చాలామంది బంధుమిత్రులు దూరమయ్యారని, ప్రస్తుతం తాను ఒక స్నేహితుడి దయ వలన అతని ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. రావణ్ శర్మ పేరును తన తల్లిదండ్రులు పెట్టటానికి కారణం వారు హేతువాదులని తెలిపారు. రామాయణం ఒక కల్పిత కథ మాత్రమే అన్నారు. తాను దైవాన్ని నమ్ముతానని చెప్పారు. కంటిచూపు పోయినంతమాత్రాన తాను బాధపడనని అన్నారు. అన్నిపనులూ తానే సొంతంగా చేసుకుంటానని చెప్పారు. తనకు లభించిన రు.25 లక్షలలో రు.5 లక్షలతో తన బకాయిలు తీరుస్తానని, కొంత సొమ్మును ప్రజాసేవకు ఉపయోగిస్తానని రావణ్ శర్మ తెలిపారు.