ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించడాన్ని తప్పు పట్టిన వైకాపా సమావేశాలు ఇంకా రెండు రోజులు ఉండగానే సభను బహిష్కరించి బయటకి వెళ్లిపోయింది. సమావేశాలలో పాల్గొన్న మూడు రోజులలో కాల్ మనీ, సెక్స్ రాకెట్, రోజాపై సస్పెన్షన్ వేటు తదితర సమస్యలపై చర్చ జరగాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలు జరుగకుండా స్తంభింపజేసింది. చేతులు రెండూ కలిస్తేనే చప్పట్లు మొగుతాయన్నట్లు ఇందులో అధికార పార్టీ తప్పు కూడా లేకపోలేదు. కాల్ మనీ వ్యవహారంలో ఎక్కువగా తెదేపా నేతల పేర్లే పైకి రావడంతో ఆ వ్యవహారంపై సభలో ఎక్కువసేపు చర్చ జరగకుండా ఉండేందుకు మధ్యలో డా. అంబేద్కర్ పై చర్చను చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అనుచితంగా మాట్లాడే సాహసం చేయగలరేమో కానీ డా.అంబేద్కర్ కి వ్యతిరేకంగా మాట్లాడలేరని గ్రహించినందునే అధికార పార్టీ ఆ ఐడియా ప్రయోగించి ఉండవచ్చును.
చంద్రబాబు నాయుడుని తెదేపాను చాలా గొప్పగా డ్డీ కొంటున్నాననే భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అప్పుడు తెదేపా పన్నిన ఈ వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని సభలో కాల్ మనీపై చర్చ జరిగేలా చేసి ఉండే ఉంటే అతని రాజకీయ చతురతను అందరూ హర్షించేవారు. ఆలా చేయలేనప్పుడు కనీసం డా. అంబేద్కర్ పై జరిగిన చర్చలో పాల్గొని ఉన్నా ప్రజలు హర్షించేవారు. కానీ కాల్ మనీపై చర్చ జరగాలని పట్టుబట్టి సభ నుండి సస్పెండ్ అయ్యారు. వైకాపా ఎమ్మల్యే రోజా కొంచెం అతిగా వ్యవహరించినందుకు ఏకంగా ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్ని వాదోపవాదాలు జరిగినప్పటికీ, వైకాపా సభలో ఉంటూ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఉంటే అది ప్రజలకు మంచి సంకేతాలు పంపి ఉండేది. కానీ మళ్ళీ ఈరోజు అదే విధంగా పట్టుబట్టి స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి జగన్మోహన్ రెడ్డి తన సభ్యులతో కలిసి బయటకు వెళ్ళిపోయారు. దాని వలన అధికార పార్టీని ఎదుర్కొనలేకనే వెళ్లిపోయినట్లు ఆయన స్వయంగా అంగీకరించినట్లయింది.