హైదరాబాద్: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అక్రమాలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలకు గానూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని పటియాలా హౌస్ డిస్ట్రిక్ట్ కోర్టులో రు.10 కోట్ల పరువునష్టం దావా వేశారు. కేజ్రీవాల్ తదితర ఆప్ నేతలు ఈ ఆరోపణలతో తనను అప్రతిష్ఠపాలు చేశారని జైట్లీ ఆరోపించారు. కోర్ట్ ఈ దావాను స్వీకరించింది. మరోవైపు ఈ కేసు దాఖలు చేయటానికి కోర్టుకు వెళ్ళిన జైట్లీకి సంఘీభావం తెలపటానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరాని కూడా కోర్టుకు వెళ్ళారు. జైట్లీ వాంగ్మూలాన్ని నమోదు చేయటానికి కేసును జనవరి 5కు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేసింది. ఇవాళ సభలు ప్రారంభమైన వెంటనే, ఈ వ్యవహారంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అంశాన్ని ఇప్పుడు చర్చించలేమని చెప్పటంతో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలో కూడా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చర్చకు తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి జైట్లీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉభయసభలూ అరగంటసేపు వాయిదా పడ్డాయి.