హైదరాబాద్: మహాభారతాన్ని తెరకెక్కించటం జీవిత లక్ష్యంగా గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్న రాజమౌళి, ఆ చిత్రాన్ని తీసేది జూనియర్ ఎన్టీఆర్తోనో, ప్రభాస్తోనో కాదట…. కొత్త నటీనటులతోనట. ఇటీవల చెన్నై ఐఐటీలో విద్యార్థులతో భేటీ అయిన సందర్భంగా వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ రాజమౌళి ఈ విషయాన్ని చెప్పారు. మహాభారతాన్ని నాలుగు భాగాలుగా తీయాల్సి ఉందని, ఆరు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. ఇంతకాలం కాల్ షీట్లు ఇవ్వటానికి పెద్ద స్టార్లకు కుదరదని చెప్పారు. కొత్త నటీనటులతో తీసి వారిని స్టార్లుగా చేస్తానని అన్నారు. తనకు పౌరాణిక, చారిత్రక చిత్రాలు చేయటం ఇష్టమని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయ, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి వారిపై సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మెల్ గిబ్సన్ తనకు అభిమాన హీరో అని చెప్పారు. బ్రేవ్ హార్ట్ సినిమా తనకు అభిమాన చిత్రమని, దానిని ఎన్నోసార్లు చూశానని, ఆ సినిమా తన మైండ్లో ఉండిపోయిందని అన్నారు. తన అభిమాన నటుడు తారక్ అని చెప్పారు. ఈ సమాధానం చెప్పేటపుడు ఆడిటోరియంలోని పలువురు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అని అరవటం వినబడింది. అభిమాన నటి అనుష్క అని చెప్పారు. ఇన్ని విజయవంతమైన సినిమాలు తీసినా అంత వినయంగా ఎలా ఉంటారని అడిగితే, మీకొక రహస్యం చెప్పాలని, తాను మంచి నటుడినని అన్నారు. తాను బాగా ఈగోయిస్టిక్ అని చెప్పారు. తన వినయాన్ని నమ్మొద్దని రాజమౌళి అన్నారు.