డిల్లీ, హైదరాబాద్, ఛత్తీస్ ఘడ్ లకు చెందిన 14 మంది భారతీయ విద్యార్ధులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి తిప్పి పంపేశారు. వారందరూ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ కాలేజిలలో చేరేందుకు శాన్ ఫ్రాన్సిస్ కో చేరుకొన్నప్పుడు వారు అమెరికాలో ప్రవేశించడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. వారు చేరాలనుకొన్న ఆ రెండు విశ్వద్యాలయాలపై కొన్ని ఆరోపణలు రావడంతో వాటిలో కొన్ని పరిమితులకు లోబడి విద్యార్ధులను తీసుకోవడానికి మాత్రమే అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. వాటిలో చేరేందుకు వచ్చిన విద్యార్ధులను ఎఫ్.బి.ఐ. అధికారులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన తరువాత అందరినీ వెనక్కి తిప్పి పంపేశారు. వారిని ఏ కారణం చేత వెనక్కి తిప్పి పంపివేశారో ఇంకా తెలియవలసి ఉంది.
ఆ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి ఇక్కడ భారత్ లో అమెరికన్ కౌన్సిలేట్ వీసా జారీ చేసిన తరువాతే సాధ్యం అవుతుంది. అంటే వారు ఆ విశ్వవిద్యాలయాలలో చదువుకొనేందుకే అమెరికా వెళ్ళాలనుకొంటున్నారని ద్రువీకరించుకొని, వారు అమెరికాలో ప్రవేశించడానికి అన్నివిధాల అర్హులని భావించిన తరువాతే వారికి వీసాలు మంజూరు చేసినప్పుడు మళ్ళీ ఈవిధంగా చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమెరికాలోనే ఉన్నత విద్య అభ్యసించాలనుకొనే విద్యార్ధుల కోసం అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు, సీనియర్ విద్యార్ధులు ప్రతీ చిన్న అంశం గురించి క్షుణ్ణంగా వివరిస్తూ సమగ్ర సమాచారాన్ని నెట్ లో అందరికీ అందుబాటులో ఉంచారు. కనుక అమెరికా వెళ్ళాలనుకొంటున్న విద్యార్ధులు ముందుగా అది చదివి అందులో సాధకబాధకాలను అర్ధం చేసుకొన్న తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఇటువంటి విపరీత సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.
కానీ ఆ రెండు అమెరికా విశ్వద్యాలయాలలో చేరేందుకు వెళ్ళిన విద్యార్ధులను అమెరికా నుండి వెనక్కి తిప్పి పంపేసారనే విషయం తెలిసిన తరువాత కూడా కొందరు భారతీయ విద్యార్ధులు మళ్ళీ అవే విశ్వద్యాలయాలలో చేరేందుకు అమెరికా బయలుదేరడానికి సిద్దమవుతుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. ఏదో విధంగా అమెరికా చేరిపోతే చాలు జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుందనే భ్రమ విద్యార్ధులలో నెలకొని ఉన్నందునే ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వారి ఈ బలహీనతను అమెరికాలో బోగస్ విశ్వవిద్యాలయాలు, భారత్ లో వాటికి ఏజెంట్లుగా పనిచేసే కొన్ని విద్యాసంస్థలు అన్నీ కలిసి విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుకొంటున్నాయి. మరి అటువంటి బోగస్ విశ్వద్యాలయాలను నడిపేందుకు అమెరికా ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందో, అందులో చేరేందుకు మళ్ళీ విద్యార్ధులకు వీసాలు ఎందుకు జారీ చేస్తోందో తెలియదు. ఏది ఏమయినప్పటికీ ఇందులో ఏదయినా తేడా వస్తే విద్యార్ధులే నష్టపోతారు కనుక అన్నివిధాల జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత వారిదేనని చెప్పకతప్పదు.